ADR Report: దేశంలో రాజకీయ పార్టీలకు డబ్బు వస్తూనే ఉంది. భారీగా వస్తోంది. ఏడీఆర్ రిపోర్ట్ చూస్తే.. రాజకీయ పార్టీలకు ఎంతలా విరాళాలు వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ డబ్బంతా నిజంగానే పార్టీలపై ప్రేమతో ఇస్తున్నారా? లేక బ్లాక్ మెయిల్ జరుగుతోందా? మహేష్‌బాబు సినిమా.. బిజినెస్‌మేన్‌లో ఓ డైలాగ్ ఉంటుంది. ఒక్క కాల్ చేస్తే.. గంటలో కోటి రూపాయలు వచ్చి పడతాయని. రాజకీయ పార్టీలు కూడా ఇలాగే బెదిరింపులకు దిగుతూ.. విరాళాల రూపంలో మనీ తీసుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీకే ఎక్కువగా విరాళాలు వస్తున్నాయి. ఈ డబ్బును అందరూ పార్టీలపై ప్రేమతోనే ఇస్తున్నారా లేక.. తమ అక్రమాలకు సహకరిస్తున్నందుకు.. విరాళాల రూపంలో ఇస్తున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.7,960.09 కోట్ల ఆదాయం సమకూర్చుకున్నాయి దేశంలోని 6 జాతీయ పార్టీలు. అవి బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ, NPEP. ఐతే.. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం మరొకటి ఉంది. ఈ మొత్తం ఆదాయంలో 85.03 శాతం ఒక్క బీజేపీకే వచ్చిందంటే నమ్మగలరా? ఆ పార్టీ ఒక్క సంవత్సరంలో రూ.6,769.14 కోట్లు సంపాదించింది. దేశవ్యాప్తంగా అధికారంలో ఉండటమే కాకుండా.. అనేక రాష్ట్రాల్లో కూడా బీజేపీ పాలన ఉంది. అందుకే.. ఆ పార్టీకే జోరుగా విరాళాలు వస్తున్నాయి. ఎన్నికల సంఘానికి పార్టీలు ఇచ్చిన ఆడిట్ రిపోర్టుల ఆధారంగా 'అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్' (ADR) ఈ వివరాల్ని విడుదల చేసింది. ఈ రిపోర్టును 2026 మార్చిలో రూపొందించింది అని ది హిందూ, డెక్కన్ హెరాల్డ్ వంటి సంస్థలు ధృవీకరించాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికలు జరిగి.. మళ్లీ NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పేరుకి కూటమి అయినా.. బీజేపీ మాటే నెగ్గే పరిస్థితి. అంటే.. బీజేపీయే బలంగా ఉన్నట్లు లెక్క. అందుకే విరాళాలు ఇచ్చేవారు కూడా ఆ పార్టీకే ఇస్తున్నారు. ఏడాదిలో రూ.6,769.14 కోట్ల ఆదాయం అంటే మాటలు కాదు. ఇది మొత్తం జాతీయ పార్టీల ఆదాయంలో భారీ వాటా. రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ రూ.918.28 కోట్లు మాత్రమే సంపాదించింది. ఆమాత్రమైనా వచ్చాయంటే.. కారణం ఆ పార్టీ తన స్థానాలను కొంత పెంచుకొని.. 99 లోక్‌సభ సీట్లు సాధించడం వల్లే. మిగిలిన పార్టీలైన సీపీఎం రూ.172.60 కోట్లు, బీఎస్పీ రూ.58.58 కోట్లు, ఆప్ రూ.39.28 కోట్లు, NPEP (నేషనల్ పీపుల్స్ పార్టీ) రూ.2.18 కోట్లు సంపాదించింది.
