Source: 
Mana Telangana
https://www.manatelangana.news/national-parties-collected-%E2%82%B9-3377-crore-from-unknown-sources/
Author: 
Date: 
31.08.2021
City: 
New Delhi

2019- 20 ఆర్థిక సంవత్సరంలో జాతీయ పార్టీలు అజ్ఞాత వనరుల నుంచి రూ. 3377.41 కోట్ల వరకు నిధులను సేకరించాయి. ఈ మొత్తం ఆ పార్టీల మొత్తం ఆదాయంలో 70.98 శాతంగా ఉందని పోల్ రైట్స్ గ్రూప్ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్ (ఎడిఆర్) తాజా నివేదిక వెల్లడించింది. అజ్ఞాత వనరుల నుంచి రూ.2642.63 కోట్లు నిధులు పొందినట్టు బిజెపి వెల్లడించింది. అన్ని పార్టీల కన్నా బిజెపి నిధుల మొత్తమే ఎక్కువ. ఇది అన్ని పార్టీల నిధుల మొత్తంలో 78.24 శాతంగా పేర్కొంది. కాంగ్రెస్ తమ నిధులు రూ.526 కోట్లుగా వెల్లడించగా మొత్తం నిధుల్లో ఇది 15.57 శాతంగా ఉంది. అలాగే ఎలెక్టోరల్ బాండ్ల నుంచి వచ్చిన నిధులు రూ.2993.826 కోట్లుగా ఉన్నాయి. 2004-05 నుంచి 2019-20 మధ్య కాలంలో జాతీయ పార్టీలు రూ.14,651 .53 కోట్లను అజ్ఞాత వనరుల నుంచి పొందగలిగాయి.

విరాళాల రూపంలో చూస్తే 2019- 20 ఆర్థిక సంవత్సరంలో రూ.20 వేల రూపాయల వంతున వచ్చిన విరాళాల మొత్తం రూ. 3.18 లక్షలు నగదు రూపంలో పార్టీలకు వచ్చాయి. 2004-05 నుంచి 2019-20 మధ్యకాలంలో కూపన్ల అమ్మకం ద్వారా కాంగ్రెస్, ఎన్‌సిపి పార్టీలకు కలిపి వచ్చిన ఆదాయం రూ. 4096.725 కోట్లుగా తేలింది. అయితే విరాళాల దాతల వివరాలు మాత్రం వెల్లడి కావడం లేదు. రాజకీయ పార్టీలు సమర్పించే ఆర్థిక నివేదికలపై ఏటా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా , ఎన్నికల కమిషన్‌లచే సమీక్షింప చేస్తే పార్టీల పరంగా జవాబుదారీతనం, పారదర్శకత పెరుగుతుందని ఎడిఆర్ సిఫార్సు చేసింది. అలాగే సమాచార హక్కు కింద జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ ఈమేరకు సమాచారం వెల్లడించాలని ఎడిఆర్ సూచించింది.

© Association for Democratic Reforms
Privacy And Terms Of Use
Donation Payment Method