Source: 
M.sakshi
https://m.sakshi.com/telugu-news/national/bjp-received-rs-351-crore-donations-electoral-trusts-2021-22-1513865
Author: 
Date: 
29.12.2022
City: 
New Delhi

కార్పొరేట్‌ సంస్థల నుంచి బీజేపీకి విరాళాల వరద పారింది. ఎలక్టరోల్‌ ట్రస్టులకు(ఈటీ) వచ్చిన కార్పొరేట్‌, వ్యక్తిగత విరాళాల్లో 72 శాతానికిపైగా కాషాయ పార్టీ ఖాతాలోకే వెళ్లాయి. పోల్‌ రైట్స్‌ సంస్థ అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) 2021-22 ఆర్థిక ఏడాదికి గల ఎలక్టరోల్‌ ట్రస్టుల విరాళాల వివరాలను వెల్లడించింది. 2021-22 ఏడాదిలో బీజేపీకి అత్యధికంగా రూ.351.50 కోట్ల విరాళాలు ఈటీల ద్వారా అందాయి. మొత్తం పార్టీలు అందుకున్న విరాళాలతో పోలిస్తే బీజేపీకే 72.17 శాతం అందినట్లు ఏడీఆర్‌ నివేదిక వెల్లడించింది. 

ద ఫ్రుడెండ్‌ ఎలక్టరోల్‌ ట్రస్ట్‌ అత్యధికంగా రూ.336.50 కోట్లు బీజేపీకి విరాళంగా అందించింది. అంతకు ముందు ఏడాది 2020-21లో రూ.209 కోట్లు ఇవ్వగా ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగింది. అలాగే.. 2021-22 ఏడాదిలో ఏపీ జనరల్‌ ఈటీ, సమాజ్‌ ఈటీ వరుసగా రూ.10కోట్లు, రూ.5 కోట్లు బీజేపీకి అందించాయి.

బీజేపీ తర్వాత రెండోస్థానంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) నిలిచింది. ఫ్రుడెంట్‌ ఎలక్టరోల్‌ ట్రస్టు ఒక్కదాని నుంచే రూ.40 కోట్లు అందాయి. మరోవైపు.. కాంగ్రెస్‌ పార్టీకి రూ.18.43 కోట్లు, ఆమ్‌ ఆద్మీ పార్టీకి రూ.21.12 కోట్లు ట్రస్టుల ద్వారా అందాయి. ఇండిపెండెంట్‌ ఈటీ నుంచి ఆప్‌ పార్టీకి రూ.4.81 కోట్లు అందిన నేపథ్యంలో కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టింది చీపురు పార్టీ. అలాగే.. స్మాల్‌ డొనేషన్స్‌ ఈటీ నుంచి కాంగ్రెస్‌కు 1.9351 కోట్లు అందాయి. ఫ్రుడెంట్‌ ఎలక్టరోల్‌ ట్రస్టు 9 రాజకీయ పార్టీలకు విరాళాలు అందించింది. అందులో టీఆర్‌ఎస్‌, సమాజ్‌వాదీ పార్టీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, శిరోమణి అకాలీ దళ్‌, పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ పార్టీ, గోవా ఫార్వర్డ్‌ పార్టీలు ఉన్నాయి. 

మరో ఆరు ఎలక్టరోల్‌ ట్రస్టులు 2021-22 ఏడాదికి గానూ రూ.487.0856 కోట్లు విరాళాలుగా అందాయని తెలిపాయి. అందులో రూ.487.0551 కోట్లు(99.994శాతం) వివిధ రాజకీయ పార్టీలకు అందించినట్లు పేర్కొన్నాయి. అయితే, ఏ పార్టీకి ఎంత ఇచ్చామనే వివరాలు వెల్లడించలేదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం విరాళాల్లో 95 శాతాన్ని అర్హతగల రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్‌ ట్రస్టు పంపిణీ చేయాలి. రిజిస్టర్‌ అయిన 23 ఎలక్టోరల్‌ ట్రస్టుల్లో 16 ట్రస్టులు తమ విరాళాల కాపీలను ఎలక్షన కమిషన్‌కు ఎప్పటికప్పుడు సమర్పిస్తున్నాయి. మిగిలిన 7 ట్రస్టులు తమ విరాళాల నివేదికలను వెల్లడించలేదు.

© Association for Democratic Reforms
Privacy And Terms Of Use
Donation Payment Method