Source: 
Author: 
Date: 
07.05.2018
City: 

అవినీతి మరకలు.. క్రిమినల్‌ కేసులు.. తీవ్ర నేరారోపణలు.. ఇవన్నీ రాజకీయ పార్టీలకేం కనబడలేదు. ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తున్న వారికి టికెట్లు ఇవ్వాల్సింది పోయి అడ్డదారులు తొక్కుతున్న నేతలను బరిలో నిలిపాయి. ఆఖరుకు అసెంబ్లీలో నీలి చిత్రాలు చూసిన నేతలకు సైతం బీజేపీ టిక్కెట్లు ఇచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో అవగతమవుతున్నది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ మంది నేర చరితులు పోటీ చేస్తుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 391 మందిపై క్రిమినల్‌ కేసులుండటం కలవరపెట్టే అంశం. ఈ వివరాలను అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రీఫార్మ్స్‌(ఏడీఆర్‌) వెల్లడించింది. ముుఖ్యంగా అక్రమ మైనింగ్‌ ద్వారా కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి సోదరులు, వారి అనుచరగణానికి బీజేపీ టిక్కెట్లివ్వడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఎన్నికల బరిలో 2,655 మంది అభ్యర్థులుంటేే.. 2560 మంది వివరాలపై ఏడీఆర్‌ పరిశీలన చేపట్టగా 391 మందిపై క్రిమినల్‌ కేసులున్నట్టు తేలింది. నలుగురిపై హత్య కేసులుండగా.. 25 మందిపై హత్యాయత్నం, 254 మందిపై తీవ్ర నేరారోపణలున్నాయి. నేర చరితుల్లో ఎక్కువ మంది బీజేపీ వారే కావడం గమనార్హం. బీజేపీ 224 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. 87 మంది అభ్యర్థులపై(37 శాతం) క్రిమినల్‌ కేసులున్నాయి. కాంగ్రెస్‌ నుంచి 59 మందిపై(27 శాతం), జేడీఎస్‌ నుంచి 41 మందిపై కేసులున్నాయి. అంతేకాక మొత్తం అభ్యర్థుల్లో 883 మంది కోటీశ్వరులుండగా.. బీజేపీ నుంచే ఎక్కువ మంది ఉన్నారు. అభ్యర్థుల ఆస్తుల సరాసరి విలువ రూ.7.54 కోట్లుగా ఉన్నది. 2012లో కర్నాటక అసెంబ్లీలో మొబైల్‌ ఫోన్‌లో బ్లూ ఫిల్మ్‌ చూసిన ఇద్దరు బీజేపీ నేతలు లక్ష్మణ్‌ సావాడీ, సిసి పాటిల్‌లకు ఆ పార్టీ టిక్కెట్లు కట్టబెట్టింది. అంతేకాక, మైనింగ్‌ అక్రమార్కులకు కూడా బీజేపీ టికెట్లు ఇచ్చింది. ఈ రెండు అంశాలతోపాటు బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్పపై ఉన్న అవినీతి మరకలను అస్త్రాలుగా చేసుకొని కాంగ్రెస్‌ పార్టీ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నది. ఈ వ్యవహారంపై ఐదు నిమిషాలు వివరణ ఇవ్వాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ.. ప్రధాని మోడీని ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీ అక్రమాలపై 'కర్నాటక మోస్ట్‌ వాంటెడ్‌' పేరుతో ఓ వీడియోను సైతం రాహుల్‌ తన ట్విటర్‌ ఖాతాలో శనివారం పోస్టు చేశారు. రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 12న పోలింగ్‌ జరగనుండగా ఫలితాలు 15న వెల్లడవుతాయి.

© Association for Democratic Reforms
Privacy And Terms Of Use
Donation Payment Method