Skip to main content
Source
Namasthe Telangana
Date
City
New Delhi

గత ఏడేండ్లలో కాంగ్రెస్‌ నుంచి అత్యధికంగా నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి జంప్‌ అయ్యారు. నేషనల్ ఎలక్షన్ వాచ్ అండ్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) దీనికి సంబంధించిన ఒక నివేదికను గురువారం విడుదల చేసింది. 2014-2021 మధ్య కాలంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 222 మంది (20 శాతం) నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరారని తెలిపింది. బీఎస్పీ తర్వాత స్థానంలో ఉన్నదని, ఆ పార్టీకి చెందిన 153 మంది (14 శాతం) ప్రజాప్రతినిధులు, అభ్యర్థులు ఇతర పార్టీల్లో చేరినట్లు వెల్లడించింది.

రాజకీయ పార్టీలు మారిన 1133 మందిలో తిరిగి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో దాదాపు 253 మంది (22 శాతం) భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరినట్లు ఆ నివేదిక పేర్కొంది. 2014-21 మధ్య జరిగిన ఎన్నికల్లో గరిష్ఠ సంఖ్యలో 177 మంది (35 శాతం) ఎంపీలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరారని తెలిపింది. అదే కాలంలో 33 మంది (7 శాతం) ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీని వీడి ఇతర పార్టీల నుంచి పోటీ చేశారని వివరించింది. పార్టీలు వీడిన నేతలు ఎక్కువగా బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపగా, తర్వాత స్థానాల్లో కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఉన్నట్లు పేర్కొంది.

2014-2021 మధ్య జరిగిన ఎన్నికల్లో రాజకీయ పార్టీలు మారి పోటీ చేసిన 500 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 173 మంది (35 శాతం) బీజేపీలో, 61 మంది (12 శాతం) కాంగ్రెస్‌లో, 31 మంది (6 శాతం) తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరినట్లు ఆ రిపోర్ట్‌ వెల్లడించింది. 2014 నుండి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలు మారి తిరిగి పోటీ చేసిన 1133 మంది అభ్యర్థులు, 500 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల స్వీయ ప్రమాణ పత్రాలను ADR విశ్లేషించి ఈ నివేదిక రూపొందించింది.