Skip to main content
Date

దేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ.. సంపదలోనూ తానే అగ్రగామి అని నిరూపించుకుంది. దేశంలోని అన్ని జాతీయ పార్టీల కన్నా కూడా బీజేపీయే ధనిక పార్టీ అని తేలింది. అన్ని జాతీయ పార్టీల ఆదాయం కలిపి ఒకెత్తయితే.. బీజేపీ ఆదాయం ఒక్కటే ఒకెత్తు. మొత్తం పార్టీల ఆదాయంలో బీజేపీ వాటానే 66.34 శాతం మరి. ఢిల్లీకి చెందిన అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) అనే మేధో సంస్థ విడుదల చేసిన నివేదిక ద్వారా ఈ విషయం తేటతెల్లమైంది. అన్ని పార్టీలు ఫైల్ చేసిన ఆదాయపన్ను రిటర్నుల ఆధారంగా ఏడీఆర్ ఈ నివేదికను తయారు చేసింది.  2016-17కి సంబంధించి అన్ని జాతీయ పార్టీల ఆదాయం మొత్తం రూ.1559.17 కోట్లు అయితే.. ఒక్క బీజేపీ ఆదాయమే రూ.1,034.27 కోట్లు అని ఆ నివేదికలో ఏడీఆర్ పేర్కొంది. ఇక, రెండో అతిపెద్ద జాతీయ పార్టీగా రూ.225.36 కోట్లతో కాంగ్రెస్ నిలిచింది. అన్ని పార్టీల ఆదాయంలో కాంగ్రెస్ వాటా 14.45 శాతం. కాగా, అత్యల్ప ఆదాయం సీపీఐదేనని ఆ నివేదిక స్పష్టం చేసింది. ఆ పార్టీ ఆదాయం కేవలం రూ.2.08 కోట్లేనట. అంటే మొత్తం ఆదాయంలో దాని వాటా కేవలం 0.13 శాతం. 

మరి, ఖర్చు...
అన్ని జాతీయ పార్టీలు కలిసి భారీగానే ఖర్చు పెట్టాయి. మొత్తంగా రూ.1,228.26 కోట్ల మేర పార్టీలు ఖర్చు చేశాయి. అందులో కూడా బీజేపీదే పైచేయి కావడం గమనార్హం. అవును ఒక్క బీజేపీయే రూ.710.5 కోట్ల మేర ఖర్చు చేసింది. కాంగ్రెస్ విషయానికొస్తే వచ్చిన ఆదాయం కన్నా ఎక్కువే ఖర్చు చేసిందన్న విషయం నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. ఆదాయం 225 కోట్ల రూపాయలైతే ఆ పార్టీ ఖర్చు చేసింది రూ.321.66 కోట్లు. ఇక, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) ఆదాయం రూ.173.58 కోట్లుగా లెక్క తేలింది. మొత్తం ఖర్చు రూ.51.83 కోట్లుగా నివేదికలో తేటతెల్లమైంది. 

భారీగా పెరిగిన బీజేపీ ఆదాయం...
ఓవైపు బీజేపీ ఆదాయం భారీగా పెరిగితే.. కాంగ్రెస్ ఆదాయం మాత్రం క్షీణించింది. 2015-16లో రూ.570.86 కోట్లుగా ఉన్న బీజేపీ ఆదాయం.. 2016-17కి వచ్చే సరికి 81.18 శాతం పెరిగి రూ.1,034.27 కోట్లకు చేరింది. కాంగ్రెస్ ఆదాయం 14 శాతం తగ్గింది. రూ.261.56 కోట్ల నుంచి రూ.225.36 కోట్లకు కాంగ్రెస్ ఆదాయం తగ్గింది. ఇక, బీఎస్పీ ఆదాయం 266.32 శాతం పెరిగింది. 2015-16 సంవత్సరానికి గానూ రూ.47.38 కోట్లుగా ఉన్న ఆ పార్టీ ఆదాయం ఏడాది తిరిగే సరికి రూ.173.58 కోట్లకు పెరిగింది. సీపీఎం ఆదాయం 6.72 శాతం తగ్గింది. 

వనరులివే...
బీజేపీ, కాంగ్రెస్‌ల ఆదాయం ప్రధానంగా విరాళాలు, నేతల కంట్రిబ్యూషన్ల ద్వారానే వచ్చింది. గ్రాంట్లు, విరాళాలు, కంట్రిబ్యూషన్ల ద్వారానే బీజేపీకి రూ.997.12 కోట్ల ఆదాయం సమకూరినట్టు నివేదికలో పేర్కొంది. అంటే మొత్తం ఆదాయంలో దాని వాటానే 96.41 శాతం. కాంగ్రెస్ విషయానికొస్తే కూపన్ల ఇష్యూ ద్వారానే రూ.115.64 కోట్ల మేర ఆదాయం సమూకరింది ఆ పార్టీకి. ఖర్చుల వ్యవహారానికి వస్తే బీజేపీ అత్యధికంగా ఎన్నికలు, ప్రచార ఎత్తుగడల కోసమే రూ.606.64 కోట్లు ఖర్చు చేసినట్టు నివేదికలో వెల్లడైంది. ఆ తర్వాత పార్టీ నిర్వహణ కోసం రూ.69.78 కోట్లు ఖర్చు చేసింది.

కాంగ్రెస్ అయితే, ఎన్నికల ప్రచారం కోసం రూ.149.65 కోట్లు ఖర్చు చేస్తే.. పార్టీ నిర్వహణ కోసం రూ.115.65 కోట్లను ఖర్చు పెట్టింది. మొత్తం ఏడు జాతీయ పార్టీలకు కలిపి వలంటరీ కంట్రిబ్యూషన్ల ద్వారానే 74.98 శాతం (రూ.1,169.07 కోట్లు) సమకూరింది. బ్యాంకుల నుంచి వడ్డీలు, ఎఫ్‌డీల రూపంలో రూ.128.60 కోట్లు, కూపన్ల ఇష్యూ ద్వారా రూ.124.46 కోట్ల ఆదాయం వచ్చిందని నివేదికలో పేర్కొంది. ‘జాతీయ రాజకీయ పార్టీల ఆదాయ వ్యయ విశ్లేషణ’ పేరిట ఏడీఆర్ ఈ నివేదికను విడుదల చేసింది.