Source: 
Manatelangana
https://www.manatelangana.news/bjp-declared-assets-worth-rs-4847-cr-in-2019-20-2/
Author: 
Date: 
30.01.2022
City: 

దేశాధికారం అనుభవిస్తున్న పార్టీకి విశేషమైన ఆస్తులు సంపద ఉంటే దాని అర్ధమేమిటి? తన చేతిలో గల అధికారాన్ని అది దుర్వినియోగం చేస్తున్నట్టే కదా! ఎన్నికల్లో పోటీ చేసే పార్టీల ఆస్తుల మధ్య అసాధారణమైన తేడా ఉన్నప్పుడు దాని ప్రభావం ఆ ఎన్నికలలో ఓటర్లు ఇచ్చే తీర్పు మీద పడే అవకాశాలే ఎక్కువ కదా! అటువంటప్పుడు ఆ ఎన్నికలు సక్రమంగా జరగలేదని భావించవలసిందే కదా! ఇవన్నీ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే అంశాలే కదా! జాతీయ రాజకీయ పక్షాల ఆస్తులకు సంబంధించి ఎన్నికల వ్యవస్థను సంస్కరించే దిశగా పని చేస్తున్న సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ సేకరించిన సమాచారం ప్రకారం 2019- 20 సంవత్సరానికి భారతీయ జనతా పార్టీ ప్రకటిత ఆస్తుల విలువ రూ. 4847.78 కోట్లు. మిగతా ఏ రాజకీయా పక్షమూ ఈ విషయంలో బిజెపి దరిదాపుల్లో లేదు. కేవలం రూ. 698.33 కోట్ల ప్రకటిత ఆస్తులతో బహుజన సమాజ్ (బిఎస్‌పి) పార్టీ చాలా దూరంలో రెండో స్థానంలో ఉంది. దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించి అనేక విధాన నిర్ణయాలు తీసుకొన్న కాంగ్రెస్ పార్టీ రూ.588.16 కోట్లతో మూడో స్థానంలో ఉంది. మొత్తం రాజకీయ పార్టీల ఆస్తుల్లో 69.37% ఒక్క బిజెపి వద్దనే ఉన్నాయని సమాచారం.

2004-05 లో బిజెపి ప్రకటిత ఆస్తుల విలువ రూ. 122.93 కోట్లు కాగా, 2014లో అధికారం లోకి వచ్చిన తర్వాత ఏడాది కాలానికి 2015-16 నాటికి 627.15% పెరిగి రూ. 893.88 కోట్లకు చేరుకున్నది. దీనిని బట్టి ప్రజలిచ్చిన అధికారాన్ని వినియోగించుకొని ఆ పార్టీ తన ఆస్తులను ఎలా పెంచుకొన్నదో అర్ధం చేసుకోవచ్చు. పార్టీలు తమకు వచ్చే ఎన్నికల విరాళాల నిధులపై ఆధారపడి మనుగడ సాగిస్తుంటాయి. రాజకీయ పక్షాలకు ఇలా విరాళాలు ఇచ్చే సంప్రదాయం ప్రజాస్వామ్య వ్యవస్థలని చెప్పుకొనే దేశాల్లో ఉంటుంది. ఆ సొమ్ముతో అవి తమ అవసరాలు నెరవేర్చుకొంటాయి. ఆదాయపు పన్ను చెల్లింపు నుండి మినహాయింపు ఉంటుంది కాబట్టి వివిధ వ్యాపార, పారిశ్రామిక సంస్థలు తమ మిగులు ఆదాయం నుంచి కొంత భాగాన్ని రాజకీయ పార్టీలకు విరాళంగా ఇస్తుంటాయి. అయితే ఆయా పార్టీల ఆధ్వర్యంలోని ప్రభుత్వాలు జనహిత గీత దాటి ప్రైవేటు సంస్థలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకొనేటప్పుడే, ఆయా సంస్థల నుంచి వాటికి దండిగా విరాళాలు అందుతాయి. ఈ విషయం భారతీయ జనతా పార్టీ అసాధారణంగా పెంచుకొన్న ఆస్తుల విలువలో ప్రస్ఫుటమవుతున్నది.

కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత కాలం దాని ఆస్తుల పెరుగుదల గణనీయంగా ఉండి, బిజెపి పాలనలో పరిస్థితి తారుమారు కావడాన్ని గమనించవచ్చు. అంతకుముందు విదేశీ కంపెనీల విరాళాలపై నిషేధం ఉండేది. వ్యాపార సంస్థలు తమ మూడేళ్ళ నికర లాభాల సగటులో 7.5% మొత్తం మాత్రమే రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వాలనే పరిమితి ఉండేది. పార్టీలు తమ రాబడి పన్ను రిటర్న్‌లలో విరాళాల వివరాలు పేర్కొని తీరవలసిన పద్ధతి ఉండేది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని తెచ్చి పారదర్శకతకు పూర్తిగా స్వస్తి చెప్పింది. ఈ విధానంలో విదేశీ, స్వదేశీ తేడా లేకుండా ఎవరైనా తాము విరాళంగా ఇవ్వదలచుకొన్న డబ్బుతో నిర్ణయించిన వ్యవధిలో స్టేట్ బ్యాంకు బాండ్లు కొని తాను ఇవ్వాలనుకున్న పార్టీకి జమ చేయొచ్చు. ఆ వ్యక్తి, సంస్థ పేరు రహస్యంగా ఉంటుంది. స్టేట్ బ్యాంకు కు, ఆ బాండు అందుకొన్న పార్టీకి మాత్రమే తెలుస్తుంది. వాస్తవానికి ఏ పార్టీకి ఎవరు ఎంతెంత విరాళం ఇచ్చారో ప్రజలకు తెలిసినప్పుడే, ఓటును సద్వినియోగం చేసుకోడం వీలవుతుంది.

అటువంటి పారదర్శకతకు తలుపులు మూసేసి తెచ్చిన బాండ్ల విధానం ఓటరు కళ్లుగప్పి ఓటును కాజేసేందుకు అవకాశం కల్పించింది. బాండ్ల విధానానికి తాను వ్యతిరేకం కాదని చెప్పిన కేంద్ర ఎన్నికల సంఘం ఎవరు ఎంత విరాళాన్ని ఏ పార్టీకి ఇస్తున్నారో తెలియవలసి ఉందని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. ఈ విధానం గుప్త ధనం చెలామణికి దుర్వినియోగమవుతుందని రిజర్వు బ్యాంకు హెచ్చరించింది. ఏటా జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్ నెలల మొదటి 10 రోజులు ఎలెక్టోరల్ బాండ్ల కొనుగోలుకు స్టేట్ బ్యాంక్ కౌంటర్లు తెరుస్తారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో అదనంగా 30 రోజులు తెరచి వుంచుతారు. ఈ పది రోజులను ఐదుకి తగ్గించాలని, పార్టీలు తాము తీసుకొన్న విరాళాల వివరాలను ఎన్నికల సంఘానికి అందించాలని సుప్రీంకోర్టు చేసిన సూచనను ఎవరూ పాటించడం లేదు. రోజు విడిచి రోజు అవినీతిపై విరుచుకుపడే మన అత్యున్నత న్యాయస్థానం మాత్రం బాండ్ల విధానంపై దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టేందుకు ఆసక్తి కనబరచకపోడం ఆశ్చర్యకరం.

© Association for Democratic Reforms
Privacy And Terms Of Use
Donation Payment Method