107 మంది ఎమ్మెల్యేలు, ఎంపిలపై ద్వేషపూరిత ప్రసంగాల కేసులు ఉన్నట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) మంగళవారం విడుదల చేసిన నివేదిక పేర్కొంది. వీరిలో అధికశాతం మంది బీజేపీకి చెందిన వారే ఉండటం గమనార్హం. ఇటువంటి కేసులున్న 480 మంది అభ్యర్థులు గత ఐదేండ్లలో రాష్ట్ర అసెంబ్లీలతో పాటు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసినట్టు తెలిపింది. ఏడీఆర్‌తో పాటు నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్‌ఈడబ్ల్యూ)లు సంయుక్తంగా ఈ సర్వే చేపట్టాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఆ సమయంలో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు స్వయంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లను అధ్యయనం చేసినట్టు నివేదిక పేర్కొంది. తమపై విద్వేష ప్రసంగాలకు సంబంధించిన కేసులు ఉన్నట్టు చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు స్వయంగా పేర్కొన్నట్టు సర్వే తెలిపింది.
నివేదిక ప్రకారం.. యూపీ (ఏడుగురు), తమిళనాడు (నలుగురు), బీహార్, కర్నాటక, తెలంగాణల నుంచి ముగ్గురు చొప్పున, అసోం, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ నుంచి ఇద్దరు చొప్పున, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్‌ల నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 33 మంది ఎంపీలపై కేసులున్నాయి. వీరిలో 22 మంది బీజేపీకి చెందినవారుకాగా, కాంగ్రెస్ (ఇద్దరు), ఆప్, ఏఐఎంఐఎం, ఏఐయూడీఎఫ్, డీఎంకే, ఎండీఎంకే, పీఎంకే, శివసేన (ఉద్ధవ్ థాకరే), వీసీకే పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఓ స్వతంత్ర ఎంపీపైనా ఈ కేసు ఉన్నట్టు నివేదిక తెలిపింది. బీహార్, యూపీల నుంచి తొమ్మిది మంది చొప్పున, ఏపీ, మహారాష్ట్ర, తెలంగాణల నుంచి ఆరుగురు చొప్పున, అసోం, తమిళనాడుల నుంచి ఐదుగురు చొప్పున, ఢిల్లీ, గుజరాత్, పశ్చిమబెంగాల్‌ల నుంచి నలుగురు చొప్పున, జార్ఖండ్, ఉత్తరాఖండ్‌ల నుంచి ముగ్గురు చొప్పున, కర్నాటక, పంజాబ్, రాజస్తాన్‌ల నుంచి ఇద్దరు చొప్పున, త్రిపుర, మధ్యప్రదేశ్, ఒడిశాల నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 74 మంది ఎమ్మెల్యేలపై కేసులున్నాయి. ఈ జాబితాలో బీజేపీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్ నుంచి 13 మంది, ఆప్ నుంచి ఆరుగురున్నారు.
Source
Nava telangana
https://navatelangana.com/107-mps-hate-speech-cases-against-mlas/
Date
City
New Delhi