చండీగఢ్: పంజాబ్‌లో కొలువుతీరిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వంలో ఏడుగురు మంత్రులపై క్రిమినల్ కేసులున్నాయి. ఇందులో నలుగురు మంత్రులు తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అనూహ్య విజయం సాధించింది. దీంతో ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి 11 మందితో పంజాబ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పంజాబ్ ఎన్నికల తీరును పరిశీలించిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), ఎన్నికల్లో నామినేషన్ సందర్భంగా పంజాబ్ మంత్రులు దాఖలు చేసిన అఫిడవిట్‌లను విశ్లేషించింది. 11 మందిలో ఏడుగురిపై (64 శాతం) నేరారోపణ కేసులు ఉన్నాయని తెలిపింది. ఇందులో నలుగురిపై (36 శాతం) తీవ్రమైన నేరారోపణలున్నట్లు తమ అఫిడవిట్లలో వారు ధృవీకరించినట్లు పేర్కొంది.
కాగా, 11 మంది మంత్రుల్లో 9 మంది కోటీశ్వరులని ఏడీఆర్ తెలిపింది. వారి సగటు ఆస్తుల విలువ రూ.2.87 కోట్లని చెప్పింది. హోషియార్‌పూర్ నియోజకవర్గానికి చెందిన మంత్రి బ్రామ్ శంకర్ (జింపా) అత్యధిక ధనవంతుడని పేర్కొంది. ఆయన ఆస్తుల విలువ రూ.8.56 కోట్లని వెల్లడించింది. భోవా ఎస్సీ నియోజరవర్గానికి చెందిన లాల్ చంద్‌కు కనిష్ఠంగా రూ.6.19 కోట్ల ఆస్తులు ఉన్నాయని వివరించింది. కోటీశ్వరులైన ఈ 9 మంది మంత్రులకు అప్పులు కూడా ఉన్నట్లు వారి అఫిడవిట్ల ద్వారా తెలుస్తున్నదని పేర్కొంది. ఇందులో మంత్రి భ్రమ్ శంకర్‌కు అత్యధికంగా రూ.1.08 కోట్ల మేర అప్పులున్నాయని చెప్పింది.
మరోవైపు ఐదుగురు మంత్రుల (45 శాతం) విద్యర్హత 10-12 తరగతి అని ఏడీఆర్ తెలిపింది. మిగతా ఆరుగురు డిగ్రీ, ఆపైగా విద్యనభ్యసించారని చెప్పింది. అలాగే ఆరుగురు మంత్రులు (55 శాతం) 31-50 మధ్య వయస్సు గలవారని, మిగతా ఐదుగురికి (45 శాతం) 51-60 మధ్య వయసు ఉంటుందని పేర్కొంది.
కాగా, హర్పాల్ సింగ్ చీమా, హర్భజన్ సింగ్, డాక్టర్ విజయ్ సింగ్లా, లాల్ చంద్, గుర్మీత్ సింగ్ మీత్ హయర్, కుల్దీప్ సింగ్ ధాలివాల్, లాల్జిత్ సింగ్ భుల్లర్, బ్రామ్ శంకర్ జింపా, హర్జోత్ సింగ్ బైన్స్, డాక్టర్ బల్జీత్ కౌర్ అనే మంది ఆప్ ఎమ్మెల్యేలు మంత్రులుగా శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. దీనికి ముందు భగత్ సింగ్ పూర్వీకుల గ్రామంలో భగవంత్ మాన్ సింగ్ సీఎంగా ప్రమాణం చేశారు.