2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాల్లో అత్యధికంగా రూ.4,340.47 కోట్లు పొందిన కేంద్రంలోని అధికార బీజేపీ మొదటిస్థానంలో నిలిచింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2022-23తో పోలిస్తే కమలం పార్టీ ఆదాయం 83.85 శాతం పెరిగింది. దేశంలోని 6 జాతీయ పార్టీలకు వచ్చిన మొత్తం రూ.5,820.91 కోట్ల విరాళాల్లో బీజేపీ వాటా 75 శాతం కావడం గమనార్హం.
- 1,225 కోట్ల రూపాయలతో రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ
- ఆదాయంలో 50 శాతమే ఖర్చు చేసిన కమలనాథులు
- 83 శాతం వ్యయం చేసిన కాంగ్రెస్
- ఆదాయానికి మించి ఖర్చు చేసిన ఆమ్‌ఆద్మీ పార్టీ, ఎన్పీపీ
- 2023-24 ఏడీఆర్ నివేదిక
BJP | ఢిల్లీ, ఫిబ్రవరి 17: 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాల్లో అత్యధికంగా రూ.4,340.47 కోట్లు పొందిన కేంద్రంలోని అధికార బీజేపీ మొదటిస్థానంలో నిలిచింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2022-23తో పోలిస్తే కమలం పార్టీ ఆదాయం 83.85 శాతం పెరిగింది. దేశంలోని 6 జాతీయ పార్టీలకు వచ్చిన మొత్తం రూ.5,820.91 కోట్ల విరాళాల్లో బీజేపీ వాటా 75 శాతం కావడం గమనార్హం.
ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) సోమవారం తన నివేదికలో వెల్లడించింది. రూ.1225.11 కోట్లతో కాంగ్రెస్ పార్టీ రెండోస్థానంలో నిలిచింది. హస్తం పార్టీ గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 170.82 శాతం పెరుగుదలతో 772.74 కోట్లు ఎక్కువ విరాళాలు పొందింది. ఆ తర్వాత రూ.167.63 కోట్లతో సీపీఐ(ఎం), రూ.64.77 కోట్లతో బీఎస్పీ, రూ.22.68 కోట్లతో ఆప్, రూ.22.44 లక్షలతో ఎన్పీపీ వరుసగా నిలిచాయి.
బీజేపీ ఖర్చులు 50 శాతమే
బీజేపీ తన ఆదాయంలో రూ.2,211.69 కోట్లు (50.96 శాతం) వ్యయం చేయగా.. కాంగ్రెస్ పార్టీ రూ.1025.24 కోట్లు (83.69 శాతం) ఖర్చు చేసినట్టు ఏడీఆర్ తెలిపింది. సీపీఐ (ఎం) రూ.127.28 కోట్లు (75.93 శాతం), బీఎస్పీ రూ.43.18 కోట్లు (66.67 శాతం) ఖర్చు చేశాయి. ఆప్, ఎన్పీపీ తమ ఆదాయానికి మించి ఖర్చులు చేసినట్టు ఏడీఆర్ నివేదించింది. ఆప్ రూ.34.09 కోట్లు ఖర్చు చేసింది.
ఎలక్టోరల్ బాండ్ల రూపంలోనే ఎక్కువ
జాతీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఎక్కువ ఆదాయం సమకూరింది. బీజేపీకి రూ.3,967.14 కోట్లు, కాంగ్రెస్ రూ.1,129.66 కోట్లు, సీపీఐ (ఎం) రూ.74.68 కోట్లు, ఆప్ రూ.22.13 కోట్లు పొందాయి.