Skip to main content
Date

రాంచీ: ఇటీవల జరిగిన ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం- కాంగ్రెస్‌- ఆర్జేడీ కూటమి విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జేఎంఎం చీఫ్‌ హేమంత్‌ సోరెన్‌ ఈ నెల 29న ప్రమాణస్వీకారం చేయనున్నారు. మొత్తం 81 స్థానాలు కలిగిన ఝార్ఖండ్‌ అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 41 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్టు ఏడీఆర్‌ నివేదిక వెల్లడించింది. ఈ ఎన్నికల్లో  ఆయా పార్టీల అభ్యర్థులు ఈసీకి సమర్పించిన డిక్లరేషన్లు, అఫిడవిట్‌లలో పేర్కొన్న వివరాల ఆధారంగా అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) సంస్థ ఈ వివరాలను విడుదల చేసింది. 

ఈ ఎన్నికల్లో  జేఎంఎం తరఫున 30 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా.. వారిలో 17 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని నివేదిక తెలిపింది. అలాగే కాంగ్రెస్‌ నుంచి 16 మంది గెలిస్తే వారిలో ఎనిమిది మంది, భాజపా నుంచి 25 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా.. వారిలో 11 మంది నేరచరితులేనని తేల్చింది. గత ఎన్నికలతో పోలిస్తే ఇది కాస్త తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే 2014 ఎన్నికల్లో 55 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులు ఉండటం గమనార్హం. 

అయితే, ఈ నివేదికపై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అలోక్‌ దుబే, జేఎంఎం నేత బబ్లూ పాండే స్పందించారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న మహిళలైనా/ పురుషులైనా ఆయా నేరాల్లో దోషులుగా తేలే వరకు ఎన్నికల్లో పోటీచేసే హక్కును కోల్పోరని తెలిపారు. ఏడీఆర్‌  రాష్ట్ర కన్వీనర్‌ మాట్లాడుతూ.. తాము ఎన్నుకునే ప్రజాప్రతినిధులకు నేర చరిత్ర ఉందన్న విషయం ప్రజలకు తెలియదని చెప్పారు. ఓటర్లంతా తమ ఇబ్బందులను, కష్టాలను పరిష్కరించే వారు కావాలనుకుంటున్నారనీ.. అందువల్ల ఈ అంశాలను అంతగా పట్టించుకోవడంలేదని తెలిపారు.

53 మంది కోటేశ్వరులే..
 అలాగే, ఝార్ఖండ్‌ అసెంబ్లీకి ఎన్నికైన వారిలో 53 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులని ఏడీఆర్‌ నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో జేఎంఎం అధినేత హేమంత్‌ సోరెన్‌, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రామేశ్వర్‌ ఓరాన్‌, భాజపా నేత భాను ప్రతాప్‌ సాహి సహా పలువురు ఎమ్మెల్యేలూ ఉన్నారు. ఈ సారి అసెంబ్లీకి ఎన్నికైన వారిలో 59శాతం మంది ఎమ్మెల్యేలు గ్రాడ్యుయేషన్‌, ఆపై విద్యాహర్హతను కలిగి ఉన్నారని నివేదిక పేర్కొంది.