Skip to main content
Date

దేశంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆదాయం ర‌య్ ర‌య్ మ‌ని పెరుగుతోంది. ఇటీవ‌ల ఎన్నికల్లో వరుస విజయాలు బీజేపీ సంపాదనను భారీగా పెంచేశాయి. ఏడాది కాలంలో కమలం పార్టీ ఆదాయం 81.18 శాతం పెరగడం గమనార్హం. మరోవైపు ఇదే 2015-16, 2016-17 మధ్య కాలంలో కాంగ్రెస్ ఆదాయం మాత్రం 14 శాతం తగ్గింది. ఈ తాజా లెక్కలను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసింది. ఎన్నికల సంఘానికి తన ఆదాయాన్ని 1034.27 కోట్లుగా బీజేపీ చూపించినట్లు ఈ సంస్థ వెల్లడించింది. అంతకుముందు ఏడాది చూపిన ఆదాయం కంటే ఇది రూ.463.41 కోట్లు ఎక్కువని ఏడీఆర్ తెలిపింది. ఇదే కాలంలో తమ పార్టీకి రూ.710 కోట్ల ఖర్చు కూడా అయినట్లు బీజేపీ లెక్కలు చూపించింది. 

అటు కాంగ్రెస్‌కు మాత్రం ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువున్నాయి. ఇదే ఏడాది కాలంలో కాంగ్రెస్ ఖర్చులు రూ.321.66 కోట్లుగా చూపెట్టింది. ఇది వాళ్ల ఆదాయం కంటే రూ.96.30 కోట్లు ఎక్కువ కావడం గమనార్హం. దేశంలోని ఏడు జాతీయ పార్టీల మొత్తం ఆదాయం రూ.1559.17 కోట్లు కాగా.. ఖర్చు రూ.1228.26 కోట్లు అని ఏడీఆర్ వెల్లడించింది. ఇందులో రూ.1169 కోట్లు విరాళాల ద్వారానే వచ్చినట్లు ఆ సంస్థ చెప్పింది. ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్ జాతీయ పార్టీలుగా ఉన్నాయి. గ‌త ఐదేళ్లుగా బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఐ పార్టీలు త‌మ ఆడిట్ నివేదిక‌ల‌ను ఎన్నిక‌ల క‌మీష‌న్‌కు స‌మ‌ర్పించ‌డంలో తీవ్ర జాప్యం చేశాయ‌ని ఏడీఆర్ వెల్ల‌డించింది.