Skip to main content
Source
Telugu Samayam
Date

దేశవ్యాప్తంగా క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల్లో కోర్టుల్లో అభియోగాలు దాఖలైన ఎంపీలు, ఎమ్మెల్యేల అఫిడవిట్లను ఏడీఆర్ అధ్యయనం చేసింది.. ఈ మేరకు నివేదిక విడుదల చేసింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8(1),(2),(3)లో పేర్కొన్న నేరాల కిందకు వచ్చే కేసుల్లో కోర్టులు అభియోగాలు నమోదు చేసిన వారి వివరాలను వెల్లడించారు. ఈ సెక్షన్ల ప్రకారం నేరం రుజువై శిక్షలు పడితే వారిపై అనర్హత వేటు పడుతుంది. దేశవ్యాప్తంగా 2019-21 మధ్య జరిగిన ఎన్నికల్లో గెలిచిన వారిలో 67 మంది ఎంపీలు, 296 మంది ఎమ్మెల్యేల (మొత్తం 363 మంది)పై అభియోగాలు నమోదై ఉన్నాయి.

ఈ రిపోర్ట్‌లో ఏపీ నుంచి మొత్తం 24 మంది ప్రజా ప్రతినిధులు ఉన్నారు. వైసీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి (రాజంపేట),మార్గాని భరత్‌ (రాజమండ్రి), బెల్లాన చంద్రశేఖర్‌ (విజయనగరం), ఎంవీవీ సత్యనారాయణ (విశాఖ)లు ఉన్నారు. రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేనమామ పి.రవీంద్రనాథ్‌రెడ్డి సహా 18 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు కరణం బలరామకృష్ణమూర్తి, వాసుపల్లి గణేశ్‌కుమార్‌‌లు ఉన్నారు. వీరిద్దరూ ప్రస్తుతం వైసీపీకి మద్దతు ఇస్తున్నారు. తెలంగాణలో ముగ్గురు ఎంపీలు ఉన్నారు. వారిలో సోయం బాపూరావు (బీజేపీ), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (కాంగ్రెస్‌), మాలోతే కవిత (టీఆర్‌ఎస్‌)పై వివిధ సెక్షన్ల కింద క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి.