Skip to main content
Source
Andhrajyothy
Author
ABN
Date

కొత్తగా కొలువు దీరనున్న 18వ లోక్‌సభకు ఎన్నికైన 543 మంది ఎంపీలలో 251 మందిపై క్రిమినల్‌ కేసులున్నాయి. మొత్తం లోక్‌సభ ఎంపీలలో వీరు 46 శాతంగా ఉన్నారు. గత లోక్‌సభలో క్రిమినల్‌ కేసులున్న ఎంపీల సంఖ్య 233 కాగా ఈసారి మరింత పెరిగింది. 2004లో 125 మంది, 2009లో 162 మంది, 2014లో 185 మంది క్రిమినల్‌ కేసులున్న వారు లోక్‌సభకు ఎన్నికయ్యారు. అత్యున్నత చట్టసభకు ఎన్నికవుతున్న క్రిమినల్‌ నేతల సంఖ్య పెరుగుతోందని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.


కొత్త లోక్‌సభ ఎంపీలలో

  • 251 మందిపై క్రిమినల్‌ కేసులు
  • హత్య, హత్యాయత్నం, రేప్‌, కిడ్నాప్‌,
  • విద్వేష ప్రసంగం అభియోగాలు
  • దోషులుగా తేలిన 27 మంది
  • వెల్లడించిన ఏడీఆర్‌

     

న్యూఢిల్లీ, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): కొత్తగా కొలువు దీరనున్న 18వ లోక్‌సభకు ఎన్నికైన 543 మంది ఎంపీలలో 251 మందిపై క్రిమినల్‌ కేసులున్నాయి. మొత్తం లోక్‌సభ ఎంపీలలో వీరు 46 శాతంగా ఉన్నారు. గత లోక్‌సభలో క్రిమినల్‌ కేసులున్న ఎంపీల సంఖ్య 233 కాగా ఈసారి మరింత పెరిగింది. 2004లో 125 మంది, 2009లో 162 మంది, 2014లో 185 మంది క్రిమినల్‌ కేసులున్న వారు లోక్‌సభకు ఎన్నికయ్యారు. అత్యున్నత చట్టసభకు ఎన్నికవుతున్న క్రిమినల్‌ నేతల సంఖ్య పెరుగుతోందని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2009తో పోలిస్తే ఈసారి వీరి సంఖ్య 55 శాతం పెరగడం గమనార్హం.

అలాగే నూతన ఎంపీలలో 170 మందిపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులున్నాయి. ఈ వివరాలను అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) సంస్థ గురువారం వెల్లడించింది. తాజా ఎన్నికల్లో గెలిచిన ఎంపీల అఫిడవిట్లను ఏడీఆర్‌ విశ్లేషించింది. దీని ప్రకారం, 27 మంది ఎంపీలు వివిధ కేసుల్లో దోషులుగా తేలారు. నలుగురు ఎంపీలపై హత్య, 27 మందిపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి.

15 మంది ఎంపీలు మహిళలపై దాడులకు పాల్పడ్డారు. వీరిలో ఇద్దరిపై అత్యాచారం కేసులున్నాయి. నలుగురిపై కిడ్నాపింగ్‌, 43 మందిపై విద్వేష ప్రసంగాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. ఈసారి ఎన్నికల్లో క్రిమినల్‌ కేసులున్న అభ్యర్థికి లభించిన విజయావకాశాలు 15.3 శాతం కాగా, క్లీన్‌ ఇమేజీ అభ్యర్థికి 4.4 శాతమే అవకాశాలు దక్కినట్లు వెల్లడైంది. పార్టీల వారీగా చూస్తే, బీజేపీ-94, కాంగ్రెస్‌-49, ఎస్పీ-21, తృణమూల్‌ కాంగ్రెస్‌-13, డీఎంకే-13, టీడీపీ-8 మంది ఎంపీలపై క్రిమినల్‌ కేసులున్నాయి. తీవ్రమైన క్రిమినల్‌ కేసుల విషయానికి వస్తే బీజేపీ-60, కాంగ్రెస్‌-32, ఎస్పీ-17, తృణమూల్‌-7, డీఎంకే-6, టీడీపీ-5, శివసేన-4 మందిపై అభియోగాలు నమోదయ్యాయి.

  • సంపన్నుల సభ

504 మంది కోటీశ్వరులు ఈసారి ఎంపీలుగా ఎన్నికయ్యారు. మొత్తం లోక్‌సభలో వీరు 93 శాతం. లోక్‌సభ ఎన్నికలలో ఎంపీలుగా గెలిచే సంపన్నుల సంఖ్య ప్రతిసారీ పెరుగుతోంది. 2009లో 315 మంది, 2014లో 443 మంది, 2019 ఎన్నికలలో 475 మంది కోటీశ్వరులు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈసారి ఈ సంఖ్య మరింత పెరిగింది. వీరిలో బీజేపీ-227, కాంగ్రెస్‌-92, డీఎంకే-21, తృణమూల్‌-27, ఎస్పీ-34, జేడీయూ-12, టీడీపీ-16 మంది ఎంపీలున్నారు. కాగా, సంపన్న అభ్యర్థులకు ఇటీవలి ఎన్నికలలో విజయావకాశాలు 19.6ు కాగా, రూ.కోటి కన్నా తక్కువ ఆస్తులు ఉన్న అభ్యర్థులకు కేవలం 0.7ు మాత్రమే ఉండటం గమనార్హం.

రూ.10 కోట్లకు పైగా ఆస్తులున్న ఎంపీలు 227 మంది (42ు) ఉన్నారు. ఎంపీల సగటు ఆస్తుల విలువ రూ.46.34 కోట్లుగా ఉంది. గుంటూరు నుంచి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్‌ (టీడీపీ) రూ.5,705 కోట్ల ఆస్తులతో ప్రథమ స్థానంలో, చేవెళ్ల నుంచి గెలిచిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (బీజేపీ) రూ.4,568 కోట్లతో రెండో స్థానంలో, హరియాణాలోని కురుక్షేత్ర నుంచి గెలిచిన నవీన్‌ జిందాల్‌ (బీజేపీ) రూ.1,241 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. విద్యార్హతల విషయానికొస్తే.. ఎంపీలలో 420 మంది డిగ్రీ, ఆపై విద్యాభ్యాసం చేసిన వారున్నారు. 105 మంది ఎంపీలు ఐదు నుంచి 12వ తరగతి వరకు చదువుకున్నారు.ఒక ఎంపీకి కేవలం చదవడం, రాయడం మాత్రమే వచ్చు.

వయస్సుల వారీగా చూస్తే, ఎంపీలలో 58 మంది 25-40 ఏళ్లు, 280 మంది 41-60 ఏళ్లు, 204 మంది 61-80 ఏళ్ల మధ్య వయస్సు వాళ్లున్నారు. 82 ఏళ్ల అత్యధిక వయస్సు ఉన్న ఎంపీ ఒకరున్నారు. మొత్తంగా ఎంపీల సగటు వయస్సు 56 ఏళ్లు. గత లోక్‌సభలో ఇది 59 ఏళ్లు కాగా ఈసారి మూడేళ్లు తగ్గింది.

  • తగ్గిన మహిళా ప్రాతినిధ్యం

మొత్తం ఎంపీలలో 74 మంది మహిళలున్నారు. గత లోక్‌సభలో మహిళా ఎంపీలు 77 మంది కాగా ఈసారి వారి సంఖ్య తగ్గింది. మరోవైపు, గత లోక్‌సభలో ఎంపీలుగా ఉన్న వారిలో 214 మంది తిరిగి ఎన్నికయ్యారు. 280 మంది తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. గత లోక్‌సభలో 36 పార్టీల నుంచి ప్రాతినిధ్యం ఉండగా, ఈసారి 41 పార్టీలకు ప్రాతినిధ్యం లభించింది.