ఆదాయంలో నంబర్ వన్ జాతీయ పార్టీగా బీజేపీ- 2023-24లో రూ.4,340.47 కోట్లు- కాంగ్రెస్ ఆదాయం రూ.1,225.12 కోట్లు
National Parties Income : భారత్‌లో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించిన జాతీయ పార్టీ బీజేపీ నిలిచింది. దేశంలోని జాతీయ పార్టీలు 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయాల వివరాలతో 'అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్- ADR' ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం 2023-24లో బీజేపీకి ఏకంగా రూ.4,340.47 కోట్ల ఆదాయం వచ్చింది. భారత్‌లోని ఆరు జాతీయ పార్టీల మొత్తం ఆదాయంలో 74.57 శాతానికి సమానమైన ఆదాయాన్ని ఒక్క బీజేపీయే సంపాదించింది. కమలదళం తమ ఆదాయంలో కేవలం 50.96 శాతం (రూ.2,211.69 కోట్లు) నిధులనే ఖర్చు చేసింది. ఇదే వ్యవధిలో కాంగ్రెస్ పార్టీకి రూ.1,225.12 కోట్ల ఆదాయం రాగా, 83.69 శాతం (రూ.1,025.25 కోట్లు) నిధులను ఖర్చు చేసింది.
2023-24లో జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాల ఆదాయంలో సింహభాగం ఎన్నికల బాండ్ల రూపంలోనే వచ్చింది. ఎన్నికల బాండ్ల ద్వారా బీజేపీకి అత్యధికంగా రూ.1,685.63 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.828.36 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.10.15 కోట్ల విరాళాలు అందాయి. ఈ మూడు జాతీయ పార్టీలకు ఎన్నికల బాండ్ల ద్వారా రూ.2,524.13 కోట్ల డొనేషన్లు వచ్చాయి. బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌ల మొత్తం ఆదాయంలో 43.36 శాతం ఎన్నికల బాండ్ల రూపంలోనే సమకూరింది. అయితే ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు విరాళాలను సేకరించే పద్ధతి అమలును నిలుపుదల చేస్తూ 2024 సంవత్సరం మే నెలలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
ఏడీఆర్ ఆర్‌టీఐ దరఖాస్తుతో వెల్లడి
ఎన్నికల బాండ్ల విరాళాల వివరాలను కోరుతూ ఏడీఆర్ సంస్థ దాఖలు చేసిన సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) దరఖాస్తుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమాధానమిచ్చింది. దీని ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చిన రూ.4,507.56 కోట్ల విరాళాలను నగదుగా మార్చుకున్నాయి. ఇందులో అత్యధికంగా రూ.2,524.13 కోట్లను(55.99 శాతం) జాతీయ పార్టీలే విత్‌డ్రా చేసుకున్నాయి.
కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా రూ.619.67 కోట్లను పాలనా వ్యవహారాలు, సాధారణ ఖర్చుల కోసం రూ.340.70 కోట్లను వెచ్చించింది. సీపీఎం తమ పార్టీపరమైన పాలనా వ్యవహారాలు, సాధారణ ఖర్చుల కోసం రూ.56.29 కోట్లను వెచ్చించింది. ఉద్యోగుల కోసం రూ.47.57 కోట్లను ఖర్చు చేసింది.
విరాళాలు, ఆర్థిక సాయాల ద్వారా
2023-24 ఆర్థిక సంవత్సరంలో విరాళాలు, ఆర్థిక సాయాల ద్వారా దేశంలోని జాతీయ పార్టీలకు రూ.2,669.87 కోట్లు సమకూరాయి. ఇందులో కాంగ్రెస్‌కు రూ.58.56 కోట్లు, సీపీఎంకు రూ.11.32 కోట్లు వచ్చాయి. సీపీఎం, కాంగ్రెస్, బీజేపీల విరాళాలకు సంబంధించిన ఆడిట్ నివేదికలు సగటున 12 నుంచి 66 రోజులు ఆలస్యంగా కేంద్ర ఎన్నికల సంఘానికి అందాయి. జాతీయ స్థాయి రాజకీయ పార్టీల ఖర్చుల్లో ఎక్కువ భాగం ఎన్నికల వ్యయాలు, పాలనాపరమైన ఖర్చులే ఉండటం గమనార్హం.