Skip to main content
Source
Hindustan Times Telugu
https://telugu.hindustantimes.com/national-international/chandra-babu-naidu-in-fourth-richest-mla-in-india-dk-shiva-kumar-tops-adr-list-121689909956662.html
Author
Sharath Chitturi
Date

Richest MLA's in India : దేశంలో ధనిక ఎమ్మెల్యేల జాబితాపై ఓ రిపోర్టు తయారు చేసింది ఏడీఆర్​. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్​ సీఎం వైఎస్​ జగన్​లు టాప్​ 10లో నిలిచారు.

Richest MLA's in India : దేశంలో ఉన్న ధనిక ఎమ్మెల్యేల జాబితాకు సంబంధించిన రిపోర్టును తాజాగా విడుదల చేసింది ఏడీఆర్​ (అసోసియేషన్​ ఆఫ్​ డెమొక్రటిక్​ రిఫార్మ్స్​) ఆంధ్రప్రదేశ్​ మాజీ సీఎం, టీడీపీ అధినేత, ప్రస్తుత ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు.. ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు! అయితే.. టాప్​లో ఉన్న ఎమ్మెల్యే ఆస్థి విలువకు.. ఈయన సంపదకు మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని చూస్తే షాక్​ అవ్వాల్సిందే..

ధనిక ఎమ్మెల్యేల జాబితా..

దేశంలోని 28 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 4001 మంది ఎమ్మెల్యేల ఎన్నికల అఫిడవిట్​లను పరిశీలించి, ఈ నివేదికను రూపొందించింది ఏడీఆర్​. టాప్​ 10 ధనిక ఎమ్మెల్యేల్లో నలుగురు చట్టసభ్యులు కాంగ్రెస్​ పార్టీకి చెందిన వారు ఉండగా.. బీజేపీ నుంచి ముగ్గురు ఉన్నారు.

కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ (కాంగ్రెస్​)​.. ఈ లిస్ట్​లో టాప్​లో ఉన్నారు. 2023 ఎన్నికల అఫిడవిట్​ ప్రకారం ఆయన ఆస్థుల విలువ రూ. 1,413కోట్లు!

రెండో స్థానంలో కర్ణాటక ఎమ్మెల్యే కేహెచ్​ పుట్టస్వామి గౌడ (స్వతంత్ర అభ్యర్థి) ఉన్నారు. ఆయన ఆస్థి విలువ రూ. 1,267 కోట్లు.

మూడో స్థానంలో కర్ణాటక కాంగ్రెస్​కు చెందిన ప్రియాకృష్ణ ఉన్నారు. ఆయన వద్ద రూ. 1,156కోట్లు విలువ చేసే సంపద ఉంది.

Chandra Babu Naidu assets : ఇక నాలుగో జాబితాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలో ఆయన సమర్పించిన అఫిడవిట్​ ప్రకారం.. ఆయన ఆస్థుల విలువ రూ. 668కోట్లు!

గుజరాత్ బీజేపీ ​ఎమ్మెల్యే జయంతిభాయ్​ సోమాభాయ్​ పటేల్​ (రూ. 661కోట్లు), కర్ణాటక కాంగ్రెస్​కు చెందిన సురేశ్​ బీఎస్​ (రూ. 648కోట్లు), ఆంధ్రప్రదేశ్​ సీఎం వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి (రూ. 510కోట్లు), మహారాష్ట్ర బీజేపీకి చెందిన పరాగ్​ షా (రూ. 500కోట్లు), ఛత్తీస్​గఢ్​ కాంగ్రెస్​కు చెందిన టీఎస్​ బాబా(రూ. 500కోట్లు), మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే మంగల్​ప్రభాత్​ లోధా (రూ. 441కోట్లు)లు ఈ జాబితాలో తదుపరి స్థానాల్లో కొనసాగుతున్నారు.

తక్కువ ఆస్థులు ఉన్న ఎమ్మెల్యేలు వీరే..

Chandra Babu Naidu net worth : ధనిక ఎమ్మెల్యేలతో పాటు తక్కువ సంపద ఉన్న చట్టసభ్యుల వివరాలను కూడా ప్రకటించింది ఏడీఆర్​. వీరిలో పశ్చిమ్​ బెంగాల్​ బీజేపీకి చెందిన నిర్మల్​ కుమార్ ధారా టాప్​లో ఉన్నారు. ఆయన ఆస్థి విలువ రూ. 1,700!

ఒడిశా స్వతంత్ర ఎమ్మెల్యే మకరందన్​ ముదాలి వద్ద రూ. 15వేలు విలువ చేసే ఆస్థులు మాత్రమే ఉన్నాయి. పంజాబ్​ ఆప్​ ఎమ్మెల్యేలు నరిందర్​ పాల్​ సింగ్​ (రూ. 18,370), ​నరిందర్​ కౌర్​ భరాజ్​ (రూ .24,409), ఝార్ఖండ్​ జేఎంఎంకు చెందిన మంగల్​ కలింది (రూ. 30వేలు)లు తదుపరి స్థానాల్లో కొనసాగుతున్నారు.