Skip to main content
Source
eenadu
https://www.eenadu.net/telugu-news/india/donations-to-national-parties-plunged-41-pc-in-2020-21-against-previous-yr-adr/0700/122135618
Date
City
Delhi

కరోనా మహమ్మారితో విధించిన లాక్‌డౌన్ల కారణంగా దేశంలో అనేక రంగాలు కుదేలయ్యాయి. ఈ ప్రభావం రాజకీయ పార్టీలపైనా పడింది. కొవిడ్‌ సమయంలో జాతీయ పార్టీల విరాళాలు కూడా దాదాపు సగం తగ్గాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశంలో గుర్తింపు పొందిన జాతీయ పార్టీల విరాళాలు రూ.420 కోట్ల మేర తగ్గినట్లు అసోసియేషన్ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) వెల్లడించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే పార్టీల విరాళాల్లో 41.49శాతం తగ్గుదల నమోదైనట్లు తెలిపింది.

ఏడీఆర్‌ నివేదిక ప్రకారం.. భారతీయ జనతా పార్టీకి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.785.77 కోట్ల విరాళాలు రాగా.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆ మొత్తం రూ.477.54కోట్లకు తగ్గింది. అంటే 39.23శాతం మేర విరాళాలు తగ్గాయి. ఇక, కాంగ్రెస్‌ పార్టీకి 2019-20లో రూ.139.01కోట్ల డొనేషన్లు రాగా.. కొవిడ్‌ సమయంలో కేవలం రూ.74.52కోట్లు మాత్రమే సమకూరాయి.

అత్యధికంగా దిల్లీ నుంచి రూ. 246కోట్లు జాతీయ పార్టీలకు విరాళంగా అందాయి. ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి రూ.71.68కోట్లు, గుజరాత్‌ నుంచి రూ.47 కోట్ల మేర విరాళాలు వచ్చాయి. ఇక ఎనిమిది గుర్తింపు పొందిన జాతీయ పార్టీలకు (భాజపా, బీఎస్పీ, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, టీఎంసీ, ఎన్సీపీ, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ) వచ్చిన మొత్తం డొనేషన్లలో 80శాతానికి పైగా అంటే.. రూ.480.655కోట్లు కార్పొరేట్‌, బిజినెస్‌ రంగాల నుంచి వచ్చినవే. మరో రూ.111.65 కోట్లను 2,258 మంది వ్యక్తులు విరాళంగా ఇచ్చినట్లు ఏడీఆర్‌ నివేదిక తెలిపింది.