Skip to main content
Source
Sakshi
https://www.sakshi.com/telugu-news/national/richest-candidate-1st-phase-has-rs-716-crore-assets-2029404
Date

న్యూఢిల్లీ, సాక్షి: లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ఈరోజు జరుగుతోంది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ తొలి దశ ఎన్నికల్లో మొత్తం 1,625 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో అత్యంత ధనవంతులు ఎవరు.. సున్నా ఆస్తులు ఉన్నవారు ఎంత మంది? వంటి ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ శుక్రవారం జరుగుతున్న ఎన్నికల్లో పోటీలో ఉన్న 1,625 మంది అభ్యర్థులను 1,618 మందిని విశ్లేషించి వారి ఆస్తులపై ఓ నివేదికను విడుదల చేసింది.  వీరిలో 10 మంది తమ ఆస్తులను సున్నాగా ప్రకటించారు. 450 మంది అభ్యర్థులు లేదా 28 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారని విశ్లేషణలో తేలింది. 

మాజీ సీఎం కొడుకే టాప్‌
రూ.716 కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించిన మధ్యప్రదేశ్‌లోని చింద్వారా సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్‌కు చెందిన నకుల్ నాథ్ అత్యంత సంపన్న అభ్యర్థి. మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కుమారుడే ఈ నకుల్‌ నాథ్. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ గెలిచిన ఏకైక సీటు ఇదే. ఇక రూ. 662 కోట్లు ప్రకటించిన ఏఐఏడీఎంకేకు చెందిన అశోక్ కుమార్ రెండో స్థానంలో ఉన్నారు. తమిళనాడులోని ఈరోడ్ నుంచి ఈయన పోటీ చేస్తున్నారు. 

రూ. 304 కోట్ల విలువైన ఆస్తులతో బీజేపీకి చెందిన దేవనాథన్ యాదవ్ మూడో స్థానంలో ఉన్నారు. ఈయన తమిళనాడులోని శివగంగ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ కార్తీ చిదంబరం ఉన్నారు. చిదంబరం రూ.96 కోట్లతో   నెట్‌వర్త్‌తో జాబితాలో పదో స్థానంలో ఉన్నారు .

సున్నా ఆస్తులున్న వారు వీరే..
తొలి దశ ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో సున్నా ఆస్తులు ఉన్నట్లు ప్రకటించినవారు 10 మంది ఉన్నారు. వీరిలో తమిళనాడులోని తూత్తుకుడి నుండి స్వతంత్ర అభ్యర్థి పోటీ చేస్తున్న పొన్‌రాజ్ కె తన వద్ద రూ. 320 విలువైన ఆస్తులు మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు. ఈయన తర్వాత మహారాష్ట్రలోని రామ్‌టెక్ నియోజకవర్గం, తమిళనాడులోని చెన్నై నార్త్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థులు కార్తీక్ గెండ్లాజీ డోక్, సూర్యముత్తులు రూ.500 ఆస్తులను ప్రకటించారు.