Source: 
Eenadu
https://www.eenadu.net/telugu-news/india/36-per-cent-rajya-sabha-candidates-criminal-cases-report/0700/124037370
Author: 
Date: 
24.02.2024
City: 
New Delhi

రాజ్యసభ ఎన్నికల్లో పోటీ పడుతున్న 58 మంది అభ్యర్థుల్లో 21 మంది (36 శాతం)పై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.

దిల్లీ: రాజ్యసభ ఎన్నికల (Rajya Sabha Polls)కు రంగం సిద్ధమైంది. ఏప్రిల్‌లో ఖాళీ అయ్యే 56 స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్‌ నిర్వహించనున్నారు. 15 రాష్ట్రాల నుంచి పోటీలో ఉన్న  మొత్తం 59 మంది అభ్యర్థుల్లో ఒకరి వివరాలు మినహా, మిగిలినవారిలో 21 మంది (36 శాతం)పై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ‘అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ADR)’, ‘నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌’లు.. అభ్యర్థుల స్వీయ ప్రమాణపత్రాలను విశ్లేషించి ఈ వివరాలు వెల్లడించాయి. పోటీదారుల సగటు ఆస్తులు రూ.127.81 కోట్లుగా ఉన్నట్లు తెలిపాయి. డాక్యుమెంట్స్‌ సరిగా స్కాన్‌ చేయనందున కర్ణాటక నుంచి పోటీ చేస్తున్న జీసీ చంద్రశేఖర్‌ వివరాలను పరిగణలోకి తీసుకోలేదు.

  • తమపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ప్రకటించిన 36 శాతం మందిలో 17 శాతం (10 మంది) అభ్యర్థులు తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. ఒకరిపై హత్యాయత్నానికి సంబంధించిన కేసు కూడా ఉంది.
  • మొత్తం 58 మందిలో 12 మంది (21 శాతం) కోటీశ్వరులు. వారు రూ.100 కోట్లకు పైగా ఆస్తులు కలిగిఉన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి అభిషేక్‌ మను సింఘ్వీ (రూ.1,872 కోట్లు), సమాజ్‌వాదీ పార్టీ నేత జయాబచ్చన్‌ (రూ.1,578 కోట్లు), కర్ణాటక జేడీఎస్‌కు చెందిన కుపేంద్రరెడ్డి (రూ.871 కోట్లు) మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు.
  • మధ్యప్రదేశ్ నుంచి భాజపా అభ్యర్థి బాలయోగి ఉమేశ్‌నాథ్ (రూ.47 లక్షలు), పశ్చిమబెంగాల్, ఉత్తర్‌ప్రదేశ్‌ల నుంచి పోటీ చేస్తున్న అదే పార్టీ నేతలు సమిక్ భట్టాచార్య, సంగీతలు (రూ.కోటి చొప్పున) తక్కువ ఆస్తులు కలిగిఉన్నారు.
  • 17 శాతం మంది 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్హతలు కలిగిఉన్నారు. 79 శాతం మంది గ్రాడ్యుయేట్, ఆపై డిగ్రీలు పూర్తి చేశారు.
  • మెజార్టీ పోటీదారులు (76 శాతం).. 51-70 ఏళ్ల మధ్య వయస్కులే. 31-50 ఏళ్లలోపు వారు 16 శాతం మంది ఉన్నారు. ఐదుగురు 70 ఏళ్లు పైబడినవారు. మొత్తం 11 మంది మహిళా అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
© Association for Democratic Reforms
Privacy And Terms Of Use
Donation Payment Method