Skip to main content
Source
NTV Telugu
https://ntvtelugu.com/national-news/29-of-30-chief-ministers-crorepatis-mamata-banerjee-only-exception-350027.html
Author
venugopal reddy
Date

Wealth of CMs: భారత రాజకీయాలు డబ్బుతో ముడిపడి ఉంటాయనేది కాదనకూడని నిజం. సాధారణంగా గ్రామస్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎంపీటీసీ, జెడ్పీటీసీలే ఒక్కసారి అధికారం వస్తే కోట్లకు పడగలెత్తుతున్నారు. అలాంటిది సీఎం అయితే కోట్ల ఆస్తులు ఉండటం చాలా సహజం. అయితే భారతదేశంలో మొత్తం 30 మంది సీఎంలలో 29 మంది కోటీశ్వరులే అని అంటే 97 శాతం మంది కోటీశ్వరులే అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) వెల్లడించింది.

ఎన్నికల ముందు సమర్పించే అఫిడవిట్ లో ఉన్న సమాచారం ప్రకారం ఏడీఆర్ ఈ నివేదికను ప్రకటించింది. ఈ నివేదికలో టాప్ లో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి టాప్ లో ఉన్నారు. అయితే కోటీశ్వరులు కానీ సీఎంగా ఒకే ఒక్కరుగా పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉన్నారు. కేవలం ఆమె ఆస్తుల విలువ రూ.15 లక్షలుగా పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డికి ఏకంగా రూ.510 కోట్ల ఆస్తులు ఉన్నాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 30 మంది ప్రస్తుత ముఖ్యమంత్రుల సెల్ఫ్ అఫిడవిట్ విశ్లేషించిన తర్వతే తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఏడీఆర్, ఎలక్షన్ వాచ్ తెలిపింది.

28 రాష్ట్రాల సీఎంలతో పాటు ఢిల్లీ, పుదుచ్చేరి ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను ప్రకటించింది. ప్రతీ ముఖ్యమంత్రి సగటున రూ.33.96 కోట్ల ఆస్తుల్ని కలిగి ఉన్నట్టు తెలిపింది. 30 మంది ముఖ్యమంత్రుల్లో 13 మంది(43 శాతం) హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, క్రిమినల్ బెదిరింపులతో సహా తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు వెల్లడైంది. తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో ఐదేళ్ల జైలుశిక్షతో కూడిన నాన్ బెయిలబుల్ నేరాలు అని నివేదిక పేర్కొంది.

ఏడీఆర్ ప్రకారం ఆస్తుల్లో మొదటి మూడు స్థానాల్లో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి( రూ. 510 కోట్లకు పైగా), అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ(రూ. 163 కోట్లకు పైగా), ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ (రూ. 63 కోట్లకు పైగా) ఆస్తుల్ని కలిగి ఉన్నారు. అత్యల్పంగా ఆస్తులు కలిగిన ముగ్గురు సీఎంలలో వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ( రూ.15 లక్షలు), కేరళ సీఎం పినరయి విజయన్ ( రూ. 1 కోటికి పైగా), హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ ( రూ. 1 కోటి కన్నా ఎక్కువ) జాబితాలో ఉన్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రూ. 3 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు నివేదిక పేర్కొంది.