Source: 
eenadu
https://www.eenadu.net/telugu-news/india/bjp-assets-worth-rs-4847-cr-in-2019-20-bsp-second-at-rs-698-crore-adr/0700/122019522
Author: 
Date: 
29.01.2022
City: 
Delhi

వరుసగా రెండుసార్లు అత్యధిక సీట్లు సాధించి కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భాజపా (BJP).. ఆస్తుల విషయంలోనూ మరే జాతీయ పార్టీకి సాధ్యం కాని రీతిలో సత్తా చాటుతోంది. ఏటేటా తన ఆర్థిక బలాన్ని పెంచుకుంటోంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో భాజపా రూ.4,847.78కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించింది. కాంగ్రెస్‌ (Congress)తో పోలిస్తే కాషాయ పార్టీ ఆస్తుల విలువ ఏకంగా 8 రెట్లకు పైనే ఉండటం గమనార్హం.

2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీల ఆస్తులను, అప్పులను అధ్యయనం చేసి అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ (ADR) ఓ నివేదిక రూపొందించింది. దీని ప్రకారం.. 7 జాతీయ పార్టీలు ప్రకటించిన ఆస్తుల విలువ మొత్తం రూ.6,988.57 కోట్లుగా ఉంది. ఇక 44 ప్రాంతీయ పార్టీల మొత్తం ఆస్తులు రూ.2,129.38కోట్లుగా ఉన్నాయి.

ఇందులో ఒక్క భాజపానే రూ.4,847.78 కోట్ల ఆస్తులను ప్రకటించింది. ఏడు జాతీయ పార్టీల మొత్తం ఆస్తుల విలువలో దాదాపు 70 శాతం ఒక్క కాషాయ పార్టీదే కావడం గమనార్హం. ఆ తర్వాత రూ.698.33 కోట్ల ఆస్తులతో బహుజన్‌ సమాజ్‌ పార్టీ రెండో స్థానంలో ఉంది. కాంగ్రెస్‌కు రూ.588.16 కోట్లు ఉన్నట్లు ఏడీఆర్‌ నివేదిక వెల్లడించింది. ఇక 44 ప్రాంతీయ పార్టీల మొత్తం ఆస్తుల విలువలో 95.27శాతం అంటే రూ.2028.71కోట్లు 10 ప్రాంతీయ పార్టీలవే అని నివేదిక తెలిపింది.

ప్రాంతీయ పార్టీల్లో రూ.563.47 కోట్ల ఆస్తులతో సమాజ్‌వాదీ పార్టీ తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)కు రూ.301.47 కోట్ల మేర ఆస్తులుండగా.. అన్నాడీఎంకే రూ.261.61 కోట్ల ఆస్తులను ప్రకటించింది. పార్టీల ఆస్తుల్లో ఎక్కువ భాగం ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలోనే ఉన్నట్లు ఏడీఆర్‌ నివేదిక వెల్లడించింది.

మరోవైపు 7 జాతీయ, 44 ప్రాంతీయ పార్టీల మొత్తం అప్పులు రూ.134.93 కోట్లుగా ఉన్నాయి. ఇందులో 74.27కోట్లు జాతీయ పార్టీల అప్పులు కాగా.. ఒక్క కాంగ్రెస్‌ పార్టీనే రూ.49.55కోట్ల రుణాలు బాకీ పడినట్లు నివేదిక తెలిపింది. తృణమూల్‌ కాంగ్రెస్‌కు రూ.11.32కోట్ల మేర అప్పులు ఉన్నట్లు పేర్కొంది. ప్రాంతీయ పార్టీల విషయానికొస్తే.. అత్యధికంగా తెలుగుదేశం పార్టీ (TDP)కి రూ. 30.34కోట్లు, డీఎంకేకు రూ.8.05కోట్ల మేర రుణాలు ఉన్నట్లు ఏడీఆర్‌ నివేదిక తెలిపింది.

© Association for Democratic Reforms
Privacy And Terms Of Use
Donation Payment Method