Skip to main content
Source
ETV Bharat
Date

ADR Report on West Bengal Politics : బంగాల్​ శాసనసభ్యుల్లో సగం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్​ ఫర్​ డెమెక్రాటిక్ రిఫార్మ్స్​ సంస్థ వెల్లడించింది. ఇంకా సగం మంది కోటీశ్వరులు ఉన్నట్లు సోమవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. మొత్తం 294 ఎమ్మెల్యేల్లో 291మంది నేరాలు, ఆర్థిక, ఇతర విషయాలను పరిశీలించి దీనిని రూపొందించినట్లు వివరించింది. ఇందులో 136 మంది (47 శాతం) ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు, మరో 109 మంది (37 శాతం) శాసనసభ్యులపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నట్లు తేలింది. 8 మంది ఎమ్మెల్యేలపై హత్య, మరో 29 మందిపై హత్యాయత్నానికి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయని ఇందులో తెలిపారు. 22 మంది ఎమ్మెల్యేల్లో ఒక రేప్ కేసు సహా మహిళలపై నేరాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఇక పార్టీల ప్రకారం చూసుకుంటే 223 తృణముల్​ కాంగ్రెస్​ ఎమ్మెల్యేల్లో 92 మంది (41 శాతం)పై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అదే 64 మంది బీజేపీ ఎమ్మెల్యేల అఫిడవిట్లు పరిశీలించగా అందులో 42మందిపై నేరారోపణలు ఉన్నాయి. 152 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు మరోవైపు నేరాలతో పాటు శాసనసభ్యుల ఆస్తులను ఏడీఆర్​ నివేదిక పేర్కొంది. 291 మందిలో దాదాపు 152మంది (52 శాతం) ఎమ్మెల్యేలు కోటీశ్వరులని ఏడీఆర్ పరిశీలనలో తేలింది. మొత్తం ప్రస్తుత శాసనసభ్యుల ఆస్తుల విలువ సుమారు రూ. 821.50 కోట్లు ఉంటుందని వెల్లడించింది. సగటున ఒక ఎమ్మెల్యే ఆస్తుల విలువ రూ. 2.82గా లెక్కగట్టింది. ఈ జాబితాలో బంగీపుర్​ ఎమ్మెల్యే జాకీర్ హుస్సేన్​ రూ. 67 కోట్లతో తొలి స్థానంలో ఉన్నారు. కస్బా ఎమ్మెల్యే అహ్మద్​ జావేద్​ ఖాన్​ రూ. 32 కోట్లు, జోరసాంకో ఎమ్మెల్యే వివేక్ గుప్తా రూ. 31 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. 182 మంది ఎమ్మెల్యేలకు డిగ్రీ బంగాల్​ శాసనసభలో 45 మంది మహిళలు, 246 మంది పురుషులు ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక పేర్కొంది. ఇందులో 124 మంది (43 శాతం) వయసు 25-50 మధ్య ఉంటుందని, మిగిలిన 167 మంది (57 శాతం) వయసు 51-70 మధ్య ఉంటుందని చెప్పింది. వీరిలో 104 మంది (36 శాతం) ఎమ్మెల్యేలు 8-12 తరగతులు చదివినట్లు తెలిపింది. మరో 182 మంది (63శాతం) ఎమ్మెల్యేలు డిగ్రీ, ఆపైన చదివినట్లు వివరించింది. బంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు తొలి జాబితా ప్రకటించిన బీజేపీ మరోవైపు బంగాల్‌లో ఏప్రిల్‌ 23, 29 తేదీల్లో రెండు విడతల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే 144 మంది అభ్యర్థులతో BJP తొలి జాబితా ప్రకటించింది. కోల్‌కతాలోని భవానిపూర్ నుంచి సువేందు అధికారిని బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ నియోజకవర్గం నుంచే బరిలో నిలిచారు. దిలీప్ ఘోష్ ఖరగ్‌పూర్ సదర్ నుంచి, స్వపన్ దాస్‌గుప్తా కోల్‌కతాలోని రాస్‌బెహారీ నుంచి పోటీ చేయనున్నారు. బంగాల్‌ అసెంబ్లీలో 294 స్థానాలు ఉండగా, మేజిక్ ఫిగర్ 148 సీట్లు. గత ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి 225 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. BJPకి 64 సీట్లు దక్కాయి. ఈ దఫా కమలం పార్టీ తీవ్రంగా ప్రచారం చేస్తుండటంతో ఏ పార్టీకి అధికారం దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. కాగా ఓట్ల లెక్కింపు మే 4న ఉండనుంది. అటు 2021 బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ పార్టీ 215 సీట్లతో విజయం సాధించగా, బీజేపీకి 77 సీట్లు వచ్చాయి.


abc