Skip to main content
Source
ETV Bharat
Author
ETV Bharat Telugu Team
Date

Regional Parties Income ADR Report : 2024-25 ఆర్థిక సంవత్సరంలో 36 ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 51.57 శాతం తగ్గింది. అంతేకాకుండా ఇందులోని 21 పార్టీలు తాము ప్రకటించిన ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేశాయి. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) మే 27న నివేదికను విడుదల చేసింది. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 67 గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీల్లోని 36 పార్టీల వార్షిక ఆడిట్ ఖాతాలను ఏడీఆర్ విశ్లేషించింది. 2025 అక్టోబర్ 31 గడువు తేదీ ముగిసిన తర్వాత 207 రోజులు గడిచినా కూడా, మిగిలిన 31 పార్టీలు తమ ఆడిట్ నివేదికలను ఈసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచలేదని ఈ నివేదిక పేర్కొంది. ఏడీఆర్ రిపోర్టు ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 36 ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయం రూ. 1,192.94 కోట్లుగా నమోదైంది. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరం ఆదాయంతో (రూ.రూ. 2,463.17 కోట్లు) పోలిస్తే రూ. 1,270.23 కోట్లు తక్కువ. పర్సంటెజీలో చూస్తే 51.57 శాతం తగ్గింది. అయితే, ఈ పార్టీలు ప్రకటించిన మొత్తం ఖర్చు రూ. 1,433.07 కోట్లకు చేరింది. ఇది వాటి మొత్తం ఆదాయం కంటే రూ. 240.12 కోట్లు లేదా సుమారు 20 శాతం అధికం కావడం గమనార్హం. మొత్తం ఆదాయంలో దాదాపు 69 శాతం వాటా, మొత్తం వ్యయంలో 77 శాతానికి పైగా వాటా కేవలం మొదటి ఐదు పార్టీలదే. అధిక ఆదాయం పొందిన ప్రాంతీయ పార్టీ ఏదంటే? 2024-25 ఆర్థిక సంవత్సరంలో అధిక ఆదాయం పొందిన ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం నిలిచింది. ఈ పార్టీ రూ. 228.31 కోట్లు ఆదాయాన్ని పొందింది. ప్రాంతీయ పార్టీల పొందిన మొత్తం ఆదాయంలో ఇది 19.14 శాతం. టీడీపీ తర్వాతి స్థానాల్లో టీఎంసీ రూ. 219.35 కోట్లు, వైసీపీ రూ. 140.39 కోట్ల ఇన్‌కమ్‌ను పొందాయి. ఖర్చుల పరంగా చూస్తే వైసీపీ అత్యధికంగా రూ. 340.20 కోట్లు ఖర్చు చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో బీజేడీ రూ. 288.44 కోట్లు, టీఎంసీ రూ. 227.59 కోట్లు ఖర్చు చేశాయి. మొత్తం 36 పార్టీల్లో 21 పార్టీలు 2024-25 ఆర్థిక సంవత్సరంలో తాము ఆర్జించిన ఆదాయం కంటే ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేశాయని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. ఏడీఆర్ రిపోర్టు ప్రకారం వైసీపీ, టీఎంసీ, బీఆర్ఎస్, బీజేడీ, జేడీయూ, ఎస్‌పీ సహా పలు పార్టీలు తమ ఆదాయాన్ని మించి ఖర్చు చేశాయి. అదే సమయంలో 15 ప్రాంతీయ పార్టీలు తమ ఆదాయంలో కొంత భాగాన్ని ఖర్చు చేయకుండా ఆదా చేశాయి. అత్యధికంగా డబ్బులు ఆదా చేసిన పార్టీగా టీడీపీ నిలిచింది. ఆ పార్టీ రూ. 166.98 కోట్లను ఖర్చు చేయకుండా పొదుపు చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర నవనిర్మాణ సేన రూ. 36.27 కోట్లు, అన్నాడీఎంకే రూ. 35.86 కోట్లతో నిలిచాయి. డొనేషన్స్ ప్రధాన ఆదాయ వనరు ప్రాంతీయ పార్టీలకు నిధుల సమీకరణలో స్వచ్ఛంద విరాళాలే ప్రధాన వనరుగా నిలిచాయి. అన్ని పార్టీలకు కలిపి విరాళాలు, చందాల ద్వారా రూ. 702.36 కోట్లు సమకూరాయి. అత్యధిక విరాళాలను పొందిన ప్రాంతీయ పార్టీగా టీఎంసీ (రూ. 184.08 కోట్లు) నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వైసీపీ (రూ. 140.05 కోట్లు), టీడీపీ (రూ. 85.20 కోట్లు) నిలిచాయి. 15 ప్రాంతీయ పార్టీలు తమ మొత్తం వ్యయంలో 55 శాతానికి పైగా ఎన్నికల ప్రచారం కోసమే ఖర్చు చేశాయి. ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం అత్యధికంగా వైసీపీ రూ. 299.92 కోట్లు ఖర్చు చేసింది. ఆ తర్వాతి బీజేడీ (రూ. 270.66 కోట్లు), బీఆర్ఎస్ (రూ.147.99 కోట్ల) నిలిచాయి. విజేతల్లో 40 శాతం మందికి 50 శాతం కంటే తక్కువ ఓట్లు : ADR నివేదిక మరోవైపు, బంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి కూడా ఏడీఆర్ నివేదిక విడుదల చేసింది. బంగాల్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల్లో సుమారు 40 శాతం మంది తమ నియోజకవర్గాల్లో పోలైన మొత్తం ఓట్లలో 50 శాతం కంటే తక్కువ ఓట్లను సాధించారని పేర్కొంది. 2026లో జరిగిన బంగాల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం 93.7 శాతంగా నమోదైందని, ఇది 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన 82.3 శాతం కంటే అధికమని తెలిపింది. మొత్తం 175 మంది అభ్యర్థులు (60 శాతం) తమ నియోజకవర్గాల్లో పోలైన ఓట్లలో 50 శాతం కంటే ఎక్కువ ఓట్లను సాధించి గెలుపొందారని వెల్లడించింది. 118 మంది అభ్యర్థులు (40 శాతం) సగం కంటే తక్కువ ఓట్లతోనే విజయం సాధించారని స్పష్టం చేసింది. నేర చరిత్ర ఉన్న 191 మంది విజేతల్లో 121 (63 శాతం) మంది 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఓట్ల వాటాతో విజయం సాధించారు. వీరిలో 107 మంది అభ్యర్థులు ఎటువంటి నేర చరిత్ర లేని (క్లీన్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న) సమీప ప్రత్యర్థులపై గెలుపొందారు. దీనికి భిన్నంగా, ఎటువంటి నేర చరిత్ర లేని 102 మంది విజేతల్లో 51 మంది నేర చరిత్ర ఉన్న అభ్యర్థులపై గెలుపొందారు. అదేవిధంగా కోటీశ్వరులైన 179 మంది విజేతల్లో 62 మంది కోటీశ్వరులు కాని సమీప ప్రత్యర్థులపై జయకేతనం ఎగురవేశారు. ఐదు స్థానాల్లో విజేత మెజారిటీ 1,000 ఓట్ల కంటే తక్కువేని ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంది.


abc