Skip to main content
Source
NT News
Date

అత్యధిక ఆదాయంతో దేశంలోనే ధనిక ప్రాంతీయ పార్టీగా ఏపీకి చెందిన తెలుగుదేశం పార్టీ నిలిచింది. ప్రధాన ప్రాంతీయ పార్టీల ఆదాయ వ్యయాలను అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) విశ్లేషించి తాజాగా నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం రూ. 228.31 కోట్ల ఆదాయంతో టీడీపీ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. మమతా బెనర్జీకి చెందిన తృణమూల్‌ కాంగ్రెస్‌ రూ. 219.35 కోట్లతో ద్వితీయ స్థానంలో, ఏపీలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ రూ. 219.35 కోట్ల ఆదాయంతో తృతీయ స్థానంలో ఉన్నాయి. ఇక ఖర్చుల పరంగా చూస్తే రూ. 340.20 కోట్లతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ మొదటి స్థానంలో ఉంది. ఈ పార్టీకి ఆదాయం కన్నా ఖర్చు రెట్టింపు కంటే ఎక్కువగా 142.33 శాతం ఉంది. తర్వాతి స్థానంలో 284.44 కోట్లతో బిజూ జనతాదళ్‌ (బీజేడీ), 227.59 కోట్లతో టీఎంసీ మూడో స్థానంలో నిలిచాయి దేశంలోని మొత్తం 36 ప్రాంతీయ పార్టీల ఆదాయం అంతకు మందు ఏడాదితో పోలిస్తే 2024-25లో 51 శాతం వరకు తగ్గిపోయింది. అలాగే 21 పార్టీల ఖర్చు తమ ఆదాయం కన్నా ఎక్కువగా చూపినట్టు ఈ నివేదిక తెలిపింది. దేశంలో గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలు 67 ఉండగా, అందులో 2024-25 ఆర్థిక సంవత్సరానికి 36 పార్టీలు మాత్రమే ఆడిట్‌ రిపోర్టులు పంపాయని, వాటి ఆధారంగానే ఈ నివేదిక తయారు చేసినట్టు సంస్థ వెల్లడించింది. టీఎంసీకి రూ.184.08 కోట్లు, వైఎస్‌ఆర్‌ పార్టీకి 140.05 కోట్లు, టీడీపీకి 85.20 కోట్లు విరాళంగా వచ్చాయి. ఈ నివేదిక తయారు చేసేటప్పటికి డీఎంకే, శివసేన, శివసేన (యూబీటీ), ఎన్సీపీ, జమ్ముకశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీలు 2024-25 ఆర్థిక సంవత్సరానికి తమ ఆడిట్‌ నివేదికలు సమర్పించ లేదు. 2024-25లో ప్రాంతీయ పార్టీలన్నింటిలో అగ్రశ్రేణి ఐదు ప్రాంతీయ పార్టీలు మొత్తం ఆదాయంలో దాదాపు 69 శాతాన్ని కలిగి ఉన్నాయి.


abc