Skip to main content
Source
NT News
Author
NT News
Date
City
New Delhi

దేశంలో సంపన్న ఎమ్మెల్యేకు రూ.3,400 కోట్ల ఆస్తులున్నాయి. (India’s Richest MLA) అయితే పేద ఎమ్మెల్యే ఆస్తి కేవలం రూ.1,700 మాత్రమే. వీరిద్దరూ బీజేపీకి చెందిన వారే కావడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ సందర్భంగా అభ్యర్థులు సమర్పించిన స్వీయ ప్రమాణ పత్రాల విశ్లేషణ ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేల ఆస్తుల గురించి నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఘాట్‌కోపర్ ఈస్ట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ నేత పరాగ్ షా సుమారు రూ.3,400 కోట్ల ఆస్తులతో దేశంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యే. అయితే పశ్చిమ బెంగాల్‌లోని సింధుకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధార అత్యంత పేద ఎమ్మెల్యే. ఆయన ఆస్తి కేవలం రూ.1,700 మాత్రమే.

కాగా, కర్ణాటకలోని కనకపుర ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌ 1,413 కోట్లకు పైగా సంపదతో రెండో స్థానంలో ఉన్నారు. కర్ణాటక స్వతంత్ర ఎమ్మెల్యే కేహెచ్ పుట్టస్వామి గౌడ రూ.1,267 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో, అదే రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే  ప్రియాకృష్ణ రూ.1,156 కోట్ల ఆస్తులతో నాలుగో స్థానంలో ఉన్నారు.

మరోవైపు టాప్ టెన్‌ సంపన్నుల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి నలుగురు ఎమ్మెల్యేలున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆస్తులు రూ.931 కోట్లు కాగా, మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డి ఆస్తులు రూ.757 కోట్లు. టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి పీ నారాయణ ఆస్తులు రూ. 824 కోట్లు,  మరో టీడీపీ ఎమ్మెల్యే వీ ప్రశాంతి రెడ్డికి రూ.716 కోట్ల ఆస్తులున్నాయి. ఐటీ మంత్రి నారా లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో సహా టాప్ 20 సంపన్న ఎమ్మెల్యేలలో ఏపీ నుంచి ఏడుగురు శాసనసభ్యులున్నారు.

కాగా, రాష్ట్రాల వారీగా కర్ణాటక ఎమ్మెల్యేలు (223 మంది సభ్యులు) ఏకంగా రూ.14,179 కోట్ల సంపదతో టాప్‌లో ఉన్నారు. మహారాష్ట్ర ఎమ్మెల్యేలు (286 మంది సభ్యులు) రూ.12,424 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల (174 మంది సభ్యులు) మొత్తం సంపద రూ.11,323 కోట్లు.

మరోవైపు అత్యల్ప ఆస్తులున్న ఎమ్మెల్యేల రాష్ట్రంగా త్రిపుర నిలిచింది. ఆ రాష్ట్రంలోని 60 మంది ఎమ్మెల్యేల మొత్తం ఆస్తులు రూ. 90 కోట్లు, మణిపూర్ ఎమ్మెల్యేలు (59 సభ్యులు) రూ. 222 కోట్లు, పుదుచ్చేరి ఎమ్మెల్యేలు (30 మంది సభ్యులు) రూ. 297 కోట్లు కలిగి ఉన్నారు.

కాగా, ఎమ్మెల్యేల అత్యధిక సగటు ఆస్తులను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ రూ.65.07 కోట్లతో టాప్‌లో ఉన్నది. కర్ణాటక రూ.63.58 కోట్లు, మహారాష్ట్ర రూ. 43.44 కోట్లు. అలాగే ఎమ్మెల్యేల అత్యల్ప సగటు ఆస్తుల పరంగా త్రిపుర రూ.1.51 కోట్లు , పశ్చిమ బెంగాల్ రూ.2.80 కోట్లు, కేరళ రూ. 3.13 కోట్లుగా ఉన్నాయి.

మరోవైపు 28 రాష్ట్ర అసెంబ్లీలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 4,092 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేల మొత్తం సంపద రూ.73,348 కోట్లు. 2023-24లో నాగాలాండ్ (రూ. 23,086 కోట్లు), త్రిపుర (రూ. 26,892 కోట్లు), మేఘాలయ (రూ. 22,022 కోట్లు) వార్షిక బడ్జెట్‌ల మొత్తాన్ని ఇది అధిగమించింది.

కాగా, ప్రధాన రాజకీయ పార్టీల్లో బీజేపీ ఎమ్మెల్యేల (1,653 మంది సభ్యులు) మొత్తం ఆస్తులు .రూ. 17,357 కోట్లు. సిక్కిం, నాగాలాండ్, మేఘాలయ వార్షిక బడ్జెట్‌ల మొత్తం కంటే ఇది ఎక్కువ. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు (646 మంది సభ్యులు) రూ. 17,357 కోట్లు, టీడీపీ ఎమ్మెల్యేలకు (134 మంది సభ్యులు) రూ.9,108 కోట్లు, శివసేన ఎమ్మెల్యేలకు (59 మంది సభ్యులు) రూ.1,758 కోట్ల ఆస్తులున్నాయి. ఒక్కో ఆప్‌ ఎమ్మెల్యేకు సగటున రూ.7.33 కోట్లు చొప్పున 123 మంది సభ్యుల మొత్తం సంపద రూ.901 కోట్లకుపైగా ఉన్నది.

మరోవైపు అఫిడవిట్‌లు సరిగా సమర్పించని 24 మంది ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలను మినహాయించి దేశంలోని 28 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 4,092 మంది ఎమ్మెల్యేల ఆస్తులపై ఏడీఆర్‌ అధ్యయనం చేసి ఈ మేరకు నివేదిక విడుదల చేసింది.


abc