Source: 
Telugu Hindustan Times
https://telugu.hindustantimes.com/telangana/adr-report-on-regional-parties-electoral-bonds-funds-dmk-bjd-brs-doubled-funds-121681011299509.html
Author: 
HT Telugu Desk
Date: 
09.04.2023
City: 

Political Parties Funds : 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశంలో 36 ప్రాంతీయ పార్టీలకు రూ.1213 కోట్ల విరాళాలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చాయని ఏడీఆర్ తెలిపింది.

Political Parties Funds : ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో దేశంలోని 10 ప్రాంతీయ పార్టీలకు రూ.852 కోట్ల విరాళాలు వచ్చినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR) తన నివేదికలో పేర్కొంది. ఎలక్టోరల్​ బాండ్స్​ రూపంలో తమిళనాడుకు చెందిన డీఎం​కే పార్టీకి భారీగా విరాళాలు వచ్చాయని తెలిపింది. 2021-22లో దేశంలోని ప్రాంతీయ పార్టీలలో డీఎం​కే రూ.318 కోట్ల విరాళాలతో మొదటిస్థానంలో ఉండగా... ఒడిశాకు చెందిన బీజూ జనతా దళ్ రూ.307 కోట్లతో రెండో స్థానంలో ఉండగా, బీఆర్ఎస్ పార్టీ రూ. 218 కోట్లతో తర్వాత స్థానంలో ఉంది. 2021- 22 సంవత్సరంలో డీఎం​కే, బీజేడీ, వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్, జేడీయూ వంటి 10 ప్రాంతీయ పార్టీలకు పెద్ద మెుత్తంలో విరాళాలు వచ్చినట్లు ఏడీఆర్ తన నివేదికలో తెలిపింది. ​ ఈ సంవత్సరంలో మొత్తం 36 ప్రాంతీయ పార్టీలకు రూ.1213 కోట్ల విరాళాలు వచ్చాయని పేర్కొంది. ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నాయని వెల్లడించింది.

ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు

ఏడీఆర్​ నివేదిక ప్రకారం... అన్ని ప్రాంతీయ పార్టీల ఆదాయంలో డీఎం​కే పార్టీ వాటా 26.27 శాతంగా ఉంది. మొదటి​ 5 పార్టీల ఆదాయం రూ.1024.42 కోట్లు కాగా ఇది మొత్తం విరాళాల్లో 84.44 శాతమని ఏడీఆర్ తెలిపింది. 2020, 2021 ఆర్థిక సంవత్సరాల్లో 36 పార్టీలలో 35 పార్టీల గణాంకాల అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. దాదాపు 20 పార్టీల ఆదాయం పెరిగిందని చెప్పింది. అయితే 15 పార్టీల ఆదాయం తగ్గినట్లు నివేదికలో పేర్కొంది. ఈ పార్టీల ఆదాయం 2020-21లో రూ.565.42 కోట్ల నుంచి 2021-22లో రూ.1,212.70 కోట్లకు పెరిగింది. ఒడిశాకు చెందిన బీజేడీకి అధికంగా రూ.233.94 కోట్ల మేర విరాళాలు పెరిగాయని ఏడీఆర్ తెలిపింది. బీఆర్ఎస్ ​కు రూ.180.45 కోట్ల విరాళాలు పెరగగా... డీఎం​కే పార్టీకి రూ.168.79 కోట్లు అధికంగా విరాళాలు వచ్చాయని తెలుస్తోంది. 21 ప్రాంతీయ పార్టీలు 2021లో తమ ఆదాయంలో కొంత భాగాన్ని కూడా ఖర్చు చేయలేదని పేర్కొంది. అయితే మరో 15 ప్రాంతీయ పార్టీలు తమ ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు చేశాయని స్పష్టంచేసింది. డీఎంకే తన ఆదాయంలో రూ.283 కోట్లు ఖర్చు చేయలేదు. బీఆర్​ఎస్​, బీజేడీ కూడా రూ. 278 కోట్లు, రూ. 190 కోట్లు ఖర్చు చేయలేదని ఏడీఆర్ వెల్లడించింది. అన్ని ప్రాంతీయ పార్టీలు కలిపి రూ.288 కోట్లు ఖర్చు చేయగా... మొదటి​ 5 స్థానాల్లో సమాజ్​ వాదీ పార్టీ రూ.54 కోట్లు, డీఎం​కే రూ.35 కోట్లు, ఆప్​ రూ.30 కోట్లు, బీజేడీ రూ.28 కోట్లు, ఏఐడీఎమ్ ​కే రూ.28 కోట్లు ఖర్చు చేశాయి.

© Association for Democratic Reforms
Privacy And Terms Of Use
Donation Payment Method