Skip to main content
Source
Eenadu.net
Date
City
NEW DELHI

2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశంలో అత్యధికంగా విరాళాలు అందుకున్న ప్రాంతీయ పార్టీల్లో భారాస ముందుంది. ఆ తర్వాతి స్థానాల్లో వైకాపా, తెదేపా ఉన్నాయి. ఆ ఆర్థిక సంవత్సరంలో రూ.216.76 కోట్లను విరాళాలుగా అందుకున్నట్లు ప్రాంతీయ పార్టీలు వెల్లడించాయి. అందులో ఒక్క భారాసకే రూ.154.03 కోట్లు లభించాయి. ఎన్నికల సంఘాని (ఈసీ)కి ఆయా పార్టీలు సమర్పించిన వివరాలను విశ్లేషించిన అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం

  • 57 ప్రాంతీయ పార్టీలను విశ్లేషించగా.. అందులో 18 పార్టీలు మాత్రమే నిర్దేశిత కాలపరిమితిలోగా విరాళాల వివరాలను ఈసీకి సమర్పించాయి. 2-164 రోజుల జాప్యంతో మరో 17 పార్టీలు ఆ డేటాను అందించాయి. బీజేడీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సహా ఏడు పార్టీలు తమకు ఆ ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి విరాళాలు అందలేదని ప్రకటించాయి.  
  • 2,119 విరాళాల ద్వారా 28 ప్రాంతీయ పార్టీలకు అందిన రూ.216.76 కోట్లపై ఏడీఆర్‌ విశ్లేషణ జరిపింది. 
  • భారాసకు మొత్తం 47 విరాళాల ద్వారా రూ.154.03 కోట్లు అందగా.. వైకాపాకు రూ.16 కోట్లు, తెదేపాకు రూ.11.92 కోట్లు లభించాయి. విరాళాల్లో 90.56 శాతం.. భారాస, వైకాపా, తెదేపా, డీఎంకే, సీపీఐలకు అందాయి. 
  • అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022-23లో కొన్ని పార్టీలకు అందిన విరాళాల్లో గణనీయ పెరుగుదల నమోదైంది. ఇందులో జేఎంఎం (3,685% పెరుగుదల), జననాయక్‌ జనతా పార్టీ (1,997%), తెదేపా (1,795%) అగ్రస్థానాల్లో ఉన్నాయి. 
  • సమాజ్‌వాదీ పార్టీ, శిరోమణి అకాలీ దళ్‌ వంటి పార్టీలకు విరాళాలు తగ్గాయి. 
  • విరాళాల్లో నగదు వాటా 0.099 శాతమే (రూ.21.45 లక్షలు) ఉంది. 
  • ఈ విరాళాల్లో కార్పొరేట్, వ్యాపార సంస్థల వాటా 78 శాతం (రూ.169.2 కోట్లు)గా ఉంది. మిగతా సొమ్ము వ్యక్తుల నుంచి అందింది. కార్పొరేట్‌ విరాళాలు అందుకున్న ప్రాంతీయ పార్టీల్లో భారాస (రూ.138.97 కోట్లు) ముందుంది. 
  • దిల్లీకి చెందిన దాతల నుంచి అత్యధికంగా రూ.107.09 కోట్లు అందాయి. ఆ తర్వాతి స్థానాల్లో తెలంగాణ (రూ.62.99 కోట్లు), ఆంధ్రప్రదేశ్‌ (రూ.8.39 కోట్లు) ఉన్నాయి.

  • abc